Monday, November 16, 2009

కొన్ని జీవితాలంతే

కొన్ని జీవితాలంతే
దుఃఖ సాగరాన్ని మధించటం
తమ జన్మ హక్కయినట్టు,
ఎప్పుడూ ఏడుస్తుంటారు.
అదేదో పెద్ద ఘనకార్యమూ,
దైవ కార్యమూ అన్నది వారి భావన

కొన్ని జీవితాలంతే
కసాయి వాణ్ణి నమ్మే గొర్రెల్లా,
ఎప్పుడూ ఎదుటివారి చేతిలో
మోసగింపబడుతుంటారు
వీళ్ళే లేకుంటే బహుశా
ఈ సృష్టి ఇంత ఆసక్తిగావుండదేమో..!!

కొన్ని జీవితాలంతే
కళ్ళు తెరిచి స్వప్నిస్తారు
కలల్లో జీవిస్తారు
రెంటినీ సమన్వయపర్చే లోపు,
పుణ్య కాలం కాస్తా పూర్తవుతుంది

కొన్ని జీవితాలంతే
వర్తమాన లో గతం గోతుల్ని
అదే పనిగా తవ్వుతుంటరు
భవిశ్యత్తు ని అదే గోతుల్లో
బొందబెడ్తుంటారు .

కొన్ని జీవితాలంతే
నిత్యం పోరాడుతుంటారు
ఆశయాల ఆరాటాలకి
సిద్దాంతాల సంకెళ్ళు
కట్టి పోరాడుతూ వుంటారు
సంకెళ్ళకి తుప్పట్టినా
వీళ్ళకి కనువిప్పు కలగదు
ఏనాటికీ..!!

ఒక్కసారి మాట్లాడాలని

చివరిసారిగా
ఒక్కసారి మాట్లాడాలని
నీ ఙ్ఞాపకాల అంపశయ్య పై
శాశ్వతనిద్రకుపక్రమిస్తున్న
నా మనసుని నగ్నంగా
నీ ముందు ఆవిష్కరించాలని ,
మన మద్యని మౌనపు తలుపులు
ఒక్కసారి తెరిచి
ఇంకొకేఒక్కసారి
మాటల ప్రవాహాన్నిబంధవిముక్తం చేసి
ఆ ప్రవాహం లోతనివితీరా మునగాలని...
అంతకంతకు అధికమౌతున్న ఆరాటం.
'నువ్వూ' అన్న భావన నాకు ఒక 'ఊహే'
అని నిశ్చయం గా నిర్దారణ
జరిగాక కూడా ఎందుకు?
అంటే ఎన్నో సమాదానం లేని సందేహాల్లో
ఇదీ ఒకటంటాను.
అయితే నేస్తం, ఖచ్చితం గా
ఇది సమాంతర గమనం లో
సాగుతున్న మన జీవితాల్ని
సమన్వయపర్చే ప్రయత్నం
ఎంత మాత్రమూ కాదు.
కొన్ని మాటలకి (నేను అన్నవి)
నేను అన్వయించుకున్న అర్దాన్ని వివరించడానికి,
సంకల్పితమో,అసంకల్పితమో
కొన్ని తప్పులకి(నే చేసినవి)
క్షమాపణ అడగి,
మనసు తేలికపర్చుకోవాలన్న
స్వార్దపూరిత ఆలోచనే తప్పమరోటి కాదు.
మన్నించమని అడగా లేను,
మన్నిస్తావని ఆశా లేదు..
అయినా ఎందుకో,..
నా హృదయ స్పందన లో
మిళితమై పోయిన వెర్రి ఆరాటం.