Saturday, August 25, 2012

ఒక శూన్య సాయంత్రం


ఒకప్పుడు..అదే ఆనాడు
మనిద్దరం కలిసి ఆ దారెంట నడిచిన ఆరోజు
అక్కడే
తుంటరి గాలి నీ కురుల ఒంపుల్లో చిక్కుకుని
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయి
నీ ముంగురులతో ఉయ్యాలలూగి
ముని వేళ్లతో సయ్యాటలాడి
నీ చెక్కిళ్లపై నుండి తుళ్లి పడుతూ కేరింతలు కొడుతూ
నీ సౌకుమార్యాన్ని పూల రెమ్మలపై అద్దడానికన్నా ముందు
కుంచెగా మారి
నా మనసు కాన్వాసుపై
నీ రూపాన్ని చిత్రించింది చూడు ...అక్కడే
నేను మౌన ప్రవాహమై
మాటలకి గంతలు కట్టిన చోట
నీ కళ్ల వాకిళ్లలో నిలబడి లోనికి
తొంగి చూసే ప్రయత్నం చేసిన చోట
నా హృదయ భాషని వినమని చెప్పలేక
నువ్వెళ్లిపోయే క్షణం రాకుండా ఆపేందుకు
కాలానికి సంకెళ్లేయాలని నే విఫలయత్నం చేసిన చోట
గతించిన కాలపు ఆనవాళ్లేమైనా
దొరుకుతాయేమోనని వెతుకుతున్నా

లేవు ఏమీ లేవు ఇక్కడ

గాలి వీస్తోంది కానీ నీ పరిమళం లేదు
ఆ చల్లని తడి స్పర్శ లేదు...ఇప్పుడది
హృదయాలు దగ్దమవుతున్న కవురు కంపు కొడుతోంది.
ఉండుండి విసురుగా నా మొహంపై దాడి చేస్తోంది
నువ్వు లేని నన్నూ..
నా ఒంటరితనాన్నీ అసహ్యించుకొంటుంది
ఆ పూలు కూడా అలానే ఉన్నాయి
కాలాలని నిషేదించిన శిలలమల్లే

ఇప్పుడా దారెంట
జ్ఞాపకాల సమాధులు బద్దలవుతున్నాయ్.
సజీవంగా కప్పెట్టబడ్డ కాలం
నా పాదాల కింద నలుగుతూ
స్మశాన సంగీతాన్ని వినిపిస్తోంది.
జ్ఞాపకం మరోసారి సమాధవుతుంది.
కొత్త ఉదయాల కోసం
ఈ శూన్య సాయంత్రంలో
గతం కుబుసాన్ని విడుచుకొందమని వచ్చిన నేను
స్మృతుల చితి మంటల్లో చలికాగి
అదే గతాన్ని ఇస్త్రీ చేసి తొడుక్కుని
మరో సాయంత్రం కోసం వెనుదిరిగా
-- శ్రీ

Friday, August 17, 2012

మనం జీవించే ఉంటాం..



మనమెప్పుడూ సంఘర్షిస్తుంటాం...
కనపడని బానిస సంకెళ్లని
బద్దలు కొట్టడానికి,
తిరుగుబాటు కొలిమిలని రాజేసేందుకు
ఆలోచనలకి అగ్గి రాస్తుంటాం.

మనమెప్పుడూ నినదిస్తుంటాం.
మట్టి వాసన పీల్చే హక్కు కోసం.
శ్రమకి తగ్గ ఫలితం కోసం.
అసమానతలు లేని సమాజం కోసం.

అందుకే
మనం దోషులమవుతాం

దోపిడీని ప్రశ్నించినందుకూ..
ప్రజాస్వామ్యం ముసుగన్నందుకూ...
ప్రత్యామ్నాయం ఉందన్నందుకే,
మనం అంతర్గత భద్రతకి
పెనుముప్పుగా పరిణమించి
నిషేదానికి గురౌతుంటాం.
పదే పదే నేరగాళ్లమవుతుంటాం.
హత్యా నేరం మోపబడి
శిరస్సుపై రాజ్యం నజరానాలని మోసుకుంటూ,
నీడని కూడా నమ్మలేని నిస్సహాయతలోకి
మన ప్రమేయం లేకుండానే నెట్టివేయబడుతుంటాం.

కాబట్టే

మనం మరణిస్తుంటాం
స్వార్థం ఆకలితో సంభోగించి
నమ్మక ద్రోహాన్ని ప్రసవించినపుడూ,
ఆశ ఆశయాన్ని మానభంగం చేస్తే
కోవర్టులు పుట్టినపుడు
అబద్దపు ఎన్్కౌంటర్లలో మనం
అకస్మాత్తుగా నేల రాలుతుంటాం

కానీ అంతలోనే

మనం మళ్లీ పుట్టుకొస్తాం
నేల రాలిన విత్తనం
మొలకెత్తినంత స్వచ్చంగా
రాత్రిని హత్య చేసిన
అరుణమంత సహజంగా
మళ్లీ మళ్లీ పుట్టుకొస్తాం.
దేర్ ఫోర్
మనమెప్పుడూ జీవించే ఉంటాం
విప్లవం వర్దిల్లాలన్న నినాదంలో,
గోడపైనే కాదు.., గుండెల్లో సైతం
వెలుగుతున్న కాగడాలో,
మార్పుకై ఎదురు చూసే కళ్లల్లో
ఎగిరే ఎర్ర జెండాలమై
మనమెప్పుడూ బతికే ఉంటాం..
 --శ్రీ

Thursday, August 16, 2012

||గీతలు||


నాజీవితంల
నాకు ఎరుకైనవి రెండే గీతలు.
పనిముట్టు చేసిన రాపిడికి
అరిగిపోయిన నా చేతి గీతలు,
చేతిల అరిగి పోయిన గీతల్ని
చెమటతో నా నుదుటిపై 
గీసుకున్న శ్రమ గీతలు

గిప్పుడు గీడెవడో
మాంటెక్ సింగో.. మాయల ఫకీరో
ఎవడైతేనేం లే
ఇద్దరూ చేసేది కనికట్టేగా.
వీడు మాయాజాలంలో
బ్రహ్మ దేవుణ్ణే మించినోడు
నా నుదుటి మీద
బ్రహ్మ గీసిన దరిద్రపు
గీతల్ని చెరపనీకొచ్చిండట.

ిఅంటే ఇప్పుడు రోజూ రాత్రి
మా పొయ్యిల పిల్లి పండుకోదా?
మా పోరలు కూడా
బడికి పోతరా?
మా ఇంట్ల ఇగ నుంచి
వాన నీళ్లు గుంతల్జెయ్యవా? 
రోగమొస్తె మాగ్గూడ
సూది మందులిత్తరా?
గీ మాత్రం గాకుండ
మా దరిద్రమెట్ల పోతది?

దరిద్రమంత బోగొడతనంటే
అబ్బో మా దొడ్డ మనిషినుకున్న.
వీనింట్ల పీనుగెల్ల
పెతోనికి పేదోడంటే
అలుసైపోయింది.
పేదోడి ఆశతోని, ఆకలితోని
ఆడుకునుడు అలవాటైపోతంది.
ఇంతకి వీని ఘనకార్యం జెప్పలే కదా
ఆడికే వత్తన్న...

నాగ్గూడ దెల్వదు గానీ
ఇన్నాళ్లూ గా దరిద్ర గీత 
నా నెత్తి మీదుండెనట.
అది మీదున్నదో, నేను కిందున్ననో
నాకైతే దెల్వదు.
గిప్పుడా గీతని 
గీ మొగోడొచ్చి నా కాళ్ల కింద గీసిండట.
గీత కిందికొస్తే దరిద్రమెట్ల బోతదో
నాకైతే సమజైత లేదు.
నా కాళ్లకి సెప్పులైన లేకపాయె..
కొడుకు దవడ పగలగొడుదును.

వీని కథలు ఇంకా ఐపోలే
అంబానీ గాని ఆస్తుల్ని
అందర్తోని భాగించి అభివృద్దంటండు.
ఉచ్చ తొట్లకి ముప్పై లక్షలు బెట్టినోడే,
రోజుకి 26 రూపాయలు
సంపాయిస్తే పేదోడు గాదంటండు.
వీడు గీసిన గీత 
దరిద్రం పోగొట్టేది కాదు
దరిద్రులని మట్టుబెట్టేది.
వాని గీతలు 
చుక్క నెత్తురు కారకుండా
పేదోళ్ల కుత్తుకలు కోసే కత్తులు.

గిదంత ఎందుగ్గానీ..,
ఒక్కటైతే జరూరుగ ఖరారైంది.
పేదోనికి ఆశపడే అర్హత లేదని.
అరిగిపోయిన అరచేతులతో
నుదుటి మీది ముడతల్ని
తడుముకుని మురుసుకునుడు తప్ప
పేదోనికి మిగిలేదేముండదని
--శ్రీ

Saturday, July 7, 2012

'' మౌనం ''



'' మౌనం ''

ఒక ఆలోచన నాలో
మౌన సాగరాన్ని
నిత్యం మథిస్తుంటుంది
ఒక మాట నాలో
పదే పదే అణుబాంబై
పేలుతుంటుంది.
ఆలోచనల కణ విచ్చిత్తి
నిరంతరం కొనసాగుతుంటుంది.
కానీ
గొంతులో పేరుకున్న
మౌనపు పూడిక దాటి
బయట పడలేక మాట
పురిట్లోనే ప్రాణం విడుస్తుంది.

అప్పుడప్పుడూ ఒక మాట
అంతరాంతరాలలో అగ్గి రాజేసి
అమాంతం పైకి రావాలని
అదే పనిగా
ఆరాట పడుతుంటుంది.
అదృష్టవశాత్తు ఆ మాట
మౌనపు అగాథాలని
చేదించుకుని బయటపడ్డా
అప్పటికే అది
నిస్సారమై, నిర్జీవమై
శవం పలుకులని
తలపిస్తోంది.

అణువణువునా మౌనం
ఆవహించిన నేను
ఎన్నటికీ బద్దలవ్వని
అగ్నిపర్వతాన్ని..
సహజ గుణాన్ని కోల్పోయిన
లావాని...
మౌనమెంత దుర్మార్గమైనదంటే
మండుతున్న లావాని సైతం
ఉండ చుట్టి తనలో దాచేసుకోగలదు.

నువ్ దూరమయ్యాక
నాలో స్పందనలున్న
ప్రతీ నాడీకణంలోనూ
మౌనం దిగ్గొట్టబడింది.
నా రక్త నాళాల నిండా
చల్లని మౌనం ప్రవహిస్తోంది
గుండె కవాటాలు సైతం
మౌనాన్ని ఆవాహన
చేసుకున్నాయి.

ఇప్పుడు నేను
మూర్తీభవించిన మౌనం
ప్రతిరూపాన్ని...
మౌనమెలా ఉంటుందంటే
నువ్వెళ్ళిపోయాక నాలా...

మౌనం ఒక
తరగని  జ్ఞాపకాల
ఊటబావి

మౌనమంటే నిశ్శబ్దమా..
కాదు... కాదు
మౌనం
భయంకర విస్పోటనం
-- శ్రీ

Friday, March 2, 2012

'' అమరత్వం పొందిన కాలం ''


మన సాంగత్యం వల్ల
నాలో అమరత్వం పొందిన
పిడికెడు కాలం
నా అంతరాంతరాలలో
ఇంకా కదలాడుతూనే ఉంది
నీ నిష్క్రమణం
చేసిన గాయాలు
బండ రాళ్ళ కొండంటి
నా మనుసులో
మోదుగ పూలల్లే
వికసిస్తూనే ఉన్నాయ్
ఇప్పుడు..
నాలో మిగిలిందేమీ లేదు
ఎప్పుడైనా
ఆ పార్క్ కి వెళ్తే
మనం చివరిసారి కలిసినప్పుడు కూర్చున్న
ఆ బెంచ్ ని ఒక సారి చూడు
ఉరేసుకున్న నా హ్రుదయం
వేలాడుతూ కనిపిస్తుంది.
ఇప్పుడు నేను నేను కాదు
కేవలం నా నిర్జివ అవశేషాన్ని
వర్తమానపు వర్ణాలేవీ
గతం గురుతులని చెరపలేకపోతున్నయ్
నాలో జీవం నింపలేక పోతున్నయ్
అనుభూతించిన క్షణాలు మాత్రం
నాలో నిత్యం రగులుతూనే ఉన్నయ్
వాటిని పూర్తిగా ఆర్పలేక
నివురు దుప్పట్లు కప్పి
నిద్ర పుచ్చుతున్నా
--శ్రీ

Wednesday, February 29, 2012

''నిషేదిత చరిత్ర''


విప్లవం ఇప్పుడొక
డస్సిపోయిన నినాదం
రివొల్యూషన్ ఇంకా
రొమాంటిక్ కలగానే ఉంది
అందుకే నిన్నిపుడు
నింగికెగసిన తారవనో
విప్లవాగ్ని ధారవనో
కీర్తించడం లేదు

ఏం సాధించావ్ కిషన్ జీ
ముప్పైదేళ్ళు అడవికే అంకితమయ్యి
కనీసం అమ్మని కూడా కలవకుండా
చెట్లమ్మటా పుట్టలమ్మటా తిరిగి
ఏం బావుకున్నావయ్యా
తెలంగాణాలో నువ్వు వెలిగించిన
చైతన్య దీప్తులు ఎక్కడా
కానరావడం లేదు లే
గ్లోబలైజేషన్ వెలుగుల ముందు
నీ కాగడా వెలవెలబోతుంది చూడు
విద్యార్థి ఉద్యమాల కాలం
నీ తరంతోనె అంతమైపోయింది

అసలు తిరుగుబాటు తత్వం
మాకెక్కడిది...
మెటీరియలిస్టిక్ బతుకు
బతుకుతున్న మాకు
గతితార్కిక భౌతిక వాదాలు
ప్రజాతంత్ర పోరాటాలు
సోషలిస్టు సిద్దాంతాలూ
అర్దం కావు ఎందుకంటే
మేము చదివిన
చరిత్ర పుస్తకాల్లో
సిక్కోలు పోరాటం,జగిత్యాల జైత్ర యాత్ర,
తెలంగాణా సాయుధ పోరాటల
ప్రస్తావనే లేదు
ఇకా మర్క్సిజం, మావోఇజం
మాకెక్కడ అర్దమవుతాయ్
అయినా ఇప్పుడున్నది ఒకే ఇజం
కెరీరిజం..

ప్రశ్నించడం గురించీ
ప్రత్యామ్నాయాల గురించి
ఆలోచించనే రాదు మాకు
నువ్వెంత చెప్పినా
శాంతిబద్రతల కోణం నుంచి తప్ప
నిన్ను వేరె విధం గా చూడలేము
ఎందుకంటే ఇప్పుడు మేము
సామ్రాజ్య వాద భావ దాస్యం లో
హాయిగానె బతుకుతున్నాం
బహుళ జాతి కంపెనీలకి
బానిసలమైనా మేము
సుఖం గానె ఉన్నాం
మా జీతం మాకొస్తుంది
మా ఇల్లు మేము కట్టుకున్నాం
రేట్లు ఎంత పెరిగినా
కొనగలిగే శక్తి ఉంది
ఇక ఎవరు ఏమైతే మాకెందుకు

నీ మరణం కించిత్ బాదని
కూడా కలిగించడం లేదు
అయినా ఎవరికోసం చచ్చిపోయావ్
ఈ భూమి మీద ఇంకా
ఆకలికి ఏడ్చేఅ వాళ్ళున్నారా?
హౌ ఫన్నీ
మన జీడీపీ చూడు
ఎట్లా పరుగులుపెడుతుందో
అడవిలో ఏముంది
రాళ్ళూ, నాగరికత తెలియని
మనుషులు తప్ప
ఒక్కసారి హైదరాబద్ వంక చూడు
ఎటు చూసినా అంతా అభివ్రుద్దే కనిపిస్తుంది

అయినా మీ మార్క్సే చెప్పడట కదా
మానవ సంబందాలన్నీ
ఆర్థిక సంబందాలేనని
ఇప్పుడు మేము కూడా
దానినే ఫాలో అవుతున్నాం
మాకు నష్టం లేనంత వరకు
ఎవడు ఏమైపోతే మాకేంటి
మా లాభం కోసం
పక్క వాడు చస్తున్న పట్టించుకోం
ఇప్పుడు ఇదే
ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్

సమాజం సున్నితత్వాన్ని
కోల్పోయింది కామ్రేడ్
క్రైం న్యూస్ ని కూడా వినోదం గా
మార్చిన మా టీవీ చానళ్ళకి
నీ చావు వార్త
ఒక రోజు బ్రేకింగ్ న్యూస్
ఎవడికి వాడు
ఆ ఉత్సుకతా, ఉత్కంఠని
ఎంజాయ్ చేసి ఎప్పటిలానె
ఎవడి పనుల్లోకి వాడు హాజరు.
ఎవడికి పట్టింది నీ చావు
అందరికీ తెలుసు
నిన్ను అన్యాయం గా మట్టుబెట్టారని
అయినా ఎవరం నోరెత్తం

కాబట్టి కామ్రేడ్
ఇప్పుడు నీ చావుని
గ్లోరిఫై చెయ్యదల్చుకోలేదు
బలవంతుడిదే రాజ్యమన్న
ఆటవిక నీతి
కొనసాగినంత కాలం
నువ్వెలాగూ చరిత్ర పుస్తకం లో
నిషేదించబడ్డ పేజీవే
నిజం గా నువ్వు కలగన్న
ఆ విప్లవం ఉదయించిననాడు
ఆ నిషేదిత పుటల్లోని
అమరుల చరిత్ర పైనే
మరో ప్రపంచపు పునాదులు
మహోద్రుతం గా పైకి లేస్తాయి
అంతవరకు లాల్ సలాం
--శ్రీ

Monday, February 27, 2012

తప్పు మీది కాదు లే

 

అవును తప్పు మీది కాదు
అస్థిత్వం ఏకోన్ముఖమైనప్పుడు
ఆత్మ గౌరవానికి అర్హతా ప్రమాణాలు
నిర్దేశించబడినప్పుడు
నేను నకిలీలా కనబడితే
పెద్ద విషయమేం కాదు లే

ఇప్పుడు అందరూ తెలంగాణాకి
కట్టుబడ్డ వాళ్ళే
అందరూ తెలంగాణా కోసం
ఎంతటి త్యాగాలకైనా
వెనుదీయని వీరులే
మరి ఇదేం విచిత్రమో ప్రతి వాడూ
అవతలి వాడిని
తెలంగాణా ద్రోహి అంటాడు
ఎవడికివాడు పార్టీల
కట్టుగొయ్యలకి కాళ్ళని కట్టేసుకుని
సమిష్టి ఉద్యమానికి కదిలి రమ్మని
పిలుపునిస్తాడు..
అటువంటి వాళ్ల వెనుక
నడిచి ఉద్రేక పడడానికి
నేనేం వెన్నెముక లేని వాణ్ణి కాను.

ప్రతివాడూ అమరవీరుల
బలిదానాలని వేనోళ్ళ కీర్తించేవాడే
వాళ్ళే రాజేసిన కాష్టం లో
అమాయక ప్రాణాలు
మిడతల్లా రాలుతోంటే
శవాలపై ప్రమాణాలు చేసి
కాడి మొయ్యడానికి పోటీలు పడ్డవాళ్ళే
యాది రెడ్డి శవంతో
ఎన్ని రాజకీయాలు చేసారో
ప్రత్యక్షం గా చూసినోణ్ణి
విక్టిం హుడ్ ని గ్లోరిఫై చేసి
సెలబ్రేట్ చేయ్యలేను
అలా చేయ్యడమే
అస్థిత్వం, ఆత్మగౌరవమంటే
అదే ఉద్యమానికి మద్దతు పలకడమంటే
క్షమించు మిత్రమా
నేను ఆత్మవంచన చేసుకోలేను

అవన్నీ ఎందుకు
ఇది ప్రజా ఉద్యమమంటావా
కాదనను కానీ ఇప్పుడు
తెలంగాణ అస్థిత్వ ఆత్మగౌరవాలు
హైజాక్ చెయ్యబడ్డాయ్
ప్రజా పోరాటం మాటున
నిజంగా జరుగుతున్నది
రాజకీయ పార్టీల మనుగడ
ఆరాటమే
ఈ మాట అంటే
ఉద్యమానికి శత్రువునైతనో
మిత్రుణ్ణైతనో నువ్వే తేల్చుకో
ఎవరినీ నమ్మించడానికి
నేను అభిప్రాయాలని మార్చుకోలేను

ఇది అంతిమ లక్ష్యం కోసం
జరుగుతున్న పోరాటం అంటావా
నా అంతిమ లక్ష్యానికి
ఇది కేవల తొలి అడుగే నేస్తం
అసలు దోపిడీ
రాష్ట్రం వచ్చాక మొదలవుతది
అప్పుడు మనిద్దరికీ మిగిలేది
ఒకటే దారి...
--శ్రీ

నేను నకిలీనెట్లైత


నేనెట్ల నకిలీనైత
నా అణువణువు లో
ప్రాణాన్ని ప్రవహింపజేసి
నా హృదయానికి తొలిసారిగా
స్పందనలు కలుగజేసి నాలో
జీవాన్ని జనింప జేసింది
ఇక్కడి గాలే ఐనప్పుడు,
నా మెదడు లో మెమొరీ గదులు
వృద్ది చెందక ముందు నుండీ
ఈ మట్టినే తిని పెరిగినప్పుడు,
పాఠ్య పుస్తకాల్లో వక్రీకరించబడ్డ
చరిత్రనే కాదు
మా ఇంటి గోడపై రాసున్న
విప్లవం వర్దిల్లాలన్న నినాదాన్నీ
నేర్పింది ఈ గడ్డే ఐనప్పుడు,
నేను నకిలీనెట్లైత..

జారిపోతున్న లాగుని పైకి లాక్కుంటూ
ఉరుకెత్తుతున్న కాలువలో వదిలిన
బతుకమ్మ వెంబడి
పూలన్నీ వేటికవే పూర్తిగా
విడిపోయి ప్రవాహం లో కలిసిపోయేదాకా
పరుగెత్తి ఆయాసం తో నిట్టూర్చినపుడు,
హోళీ కి మూడు రోజుల ముందునుంచి
మోదుగ పూల రసంతో
రంగులు తయారు చేసినపుడు
సవాసగాళ్ళంతా జాజిరి కర్రల
కోలాటమాడుతూ ఊరంతా తిరుగుతుంటే
వాళ్ళతో పాటు పాటలు పాడుకుంటూ
వెళ్ళినపుడెపుడూ నన్ను నకిలీ అన్లేదు
మరి ఇప్పుడు ఎట్ల నకిలీనైన??

ఊహ తెలిసిన నాటి నుంచి
గర్వం గా తలెత్తుకుని
మాది వరంగల్ అని
చెప్పుకోవడమే నాకు తెలుసు
అప్పుడెప్పుడూ నా గొంతులోని
శబ్దాల ఎత్తుపల్లాలని
ఎవరూ తరచి చూడలేదు
ఇప్పుడు అదే మాట చెప్పడానికి
మాటని మాడ్యులేట్ చెయ్యాల్సి వస్తోంది
గొంతులో ఏ మాటనైనా
ఈ ప్రాంత యాసలో పలికే
వాయిస్ ఫిల్టర్లు పెట్టుకోవాల్సి వస్తోంది
రెండు భాషలు మాట్లాడటం
అదనపు అర్హతయితే
రెండు యాసలు మాట్లాడితే మాత్రం
మనిషి నకిలీ ఐతండు..

అనివార్యం గా సంక్రమించిన
అనువంశిక చుట్టరికాలు తప్ప
ఆ ప్రాంతం తో
ఎటువంటి మానసికానుబంధం లేనందుకు
అక్కడి వాళ్ళకి నేను
''నైజామోణ్ణీ'
నా భాషలోనో, నా యాసలోనో
ఎక్కడో ఓ మూల
ఆ ప్రాంత అవశేషాలు
నాలో ఇంకా మిగిలి ఉన్నందుకు
ఇక్కడి వాళ్ళకేమో
''సెటిలర్నీ'
ఇప్పుడు నేను
ఇద్దరికీ నకిలీనే

ఇవన్నీ పక్కన పెడితే
నా కులం నన్ను నకిలీని చేసిందట
ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి,
ఇక్కడే చదువుకుని, ఇక్కడివాడిగానే
బతుకుతున్నా
నా ప్రమేయం లేకుండానే
ఆ కులం లో పుట్టినందుకు నేను నకిలీనైన

ఇంకా నేనెందుకు నకిలీనైన్నంటే
ఉద్యమాన్ని భుజానేసుకోక పోగా
కనీసం ఆ ముసుగైన తొడుక్కొని
మాటకి ముందొకసారి, వెనకొకసారి
నినాదాలు పలకనందుకు
రాజ్యాధికారం కోసం పోరాడాల్సింది
పెట్టుబడిదారీ వ్యవస్థ పైనా?
రాజకీయ వ్యవస్థ పైనా?
అని ప్రశ్నించినందుకు
ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాల్నో
నాదైన అభిప్రయాన్ని చెప్పినందుకే
బహుషా నేను నకిలీనైంది
--శ్రీ

Sunday, February 26, 2012

భారత్ యెలిగిపోతంది

 

భారత్ యెలిగిపోతంది

మొన్నే ప్రపంచానికే పెద్దన్న
ఒబామా భారత్ వెలిగిపోతుందని
చెబితే ఎమో అనుకున్నా
అవును నిజమే...
భారత్ యెలిగిపోతంది
2జీ, సీజీ, కేజీ
ఒకదానిని మించి ఒకటి
స్కాముల చరిత్రనే
అపహాస్యం చేసిన కుంభకోణాలతో
ధగ ధగలాడిపోతంది

మా బతుకుల్లో బూడిద నింపి
థర్మల్ ప్రాజెక్టులు కట్టొద్దన్నందుకు,
మా నోట్లో మట్టికొట్టి
మన్యం లో మైనింగ్ చెయ్యొద్దన్నందుకు
నిర్దాక్షిణ్యం కురుస్తున్న
బుల్లెట్ల వర్షం లో యెలిగిపోతంది

అరవై యేళ్ళుగా రగులుతున్న
కాశ్మీర్ కాష్టపు వెలుగుల్లో
ఆశ నిరాశల అశనిపాతమై
నిత్యాగ్నిహోత్రం లా మండుతున్న తెలంగాణలో
భుగ్గయిపోతున్న విద్యార్థుల భవిశ్యత్తులో
భారత్ యెలిగిపోతంది.

రోజూ రెక్కలు ముక్కలవుతున్నా
కుటుంబానికి పూటకి సరిపడా
సరుకులనైనా కొనలేని దైన్యం
పేదవాడి కడుపుని దహించివేస్తున్న
ఆకలి మంటల భుగ భుగల్లో యెలిగిపోతంది

పుట్లిరిగేల పండించినా
అర్దాకలిని కూడా తీర్చలేని
వ్యవసాయం చేయలేక
ఆత్మహత్యలు చేసుకుంటున్న
అన్నదాతల చితిమంటల వెలుగుల్లో
భారత్ ధగద్ధమాయం గా యెలిగిపోతంది

--శ్రీ
పిచ్చి కుక్క

అవును అతను కుక్కే...
తన దేశ సంపద పై తోడేళ్ళు కన్నేస్తే
దశాబ్దాల పాటు కాపు గాసిన కుక్కే
అవును అతను ఖచ్చితం గా పిచ్చి కుక్కే
అగ్ర రాజ్యపు అడుగులకి మడుగులొత్తకుండా
అమెరికా అధికారాన్నే ప్రశ్నిస్తే
పిచ్చి కుక్క కాక మరేమవుతాడు.

అతను ఖచ్చితం గా పిచ్చికుక్కే
తన దేశపు చమురు నిల్వలు
తన ప్రజలకి మాత్రమే చెందాలనుకోవడం,
చుక్క నెత్తురు చిందకుండా
రాజరికాన్ని అంతం చెసినా,
అధికారం చెలాయించడానికి
అమెరికా ముందు తోక ఆడించాలి గాని
జాడించకూడదని తెలియని పిచ్చి కుక్క.

అవును అతను నియంతే
మానవ హక్కులని హరించిన దుర్మార్గుడే
కాని హక్కులని హరించాలంటే
ప్రజాస్వామ్యపు ముసుగు వెసుకోవాలని
తెలియని పిచ్చోడు...
ప్రజాస్వామిక హక్కులని భక్షించినా
దాన్లో నాటో తోడేళ్ళకి కూడా
భాగం పంచితే సరిపోతుందన్న
కనీస లోక ఙ్ఞానం లేని వాడు
అదే వుంటే...
గ్వాంటనమో బే లాంటి జైలు కట్టుకుని,
ఆమ్నెస్టీ ఇంటెర్నేషనల్ కి
విరివి గా విరాళమిచ్చి
చేతులు దులుపుకునేవాడు కాని
పిచ్చోడి లా మానవ హక్కుల కోర్టులో
దోషి గా ఎందుకు నిలబడతాడు

అతను ఖచ్చితం గా పిచ్చి కుక్కే
కాకపొతే..
అధికారం లొకి వచ్చిన
నాలుగు దశాబ్దాల్లోనే
అక్షరాస్యతని వంద శాతానికిపెంచి
నిరుద్యొగితని పూర్తిగా నిర్మూలిస్తాడా
పిచ్చికుక్కే కాకుంటే
వ్యభిచారాన్ని,మద్యపానాన్ని నిషేదిస్తాడా

ఒకనాడు రక్తం చింద కుండా
లిబియన్ రెవల్యూషన్ ని విజయవంతం చేసి
లిబియా ని ఆర్థికం గా పరిపుష్టం చేసి
ప్రజల చేత జేజేలు కొట్టించుకున్న గడాఫీ
పిచ్చోడు కాబట్టే అదే ప్రజల చేతిలో
హత్య కావించబడ్డాడు..చరిత్ర హీనుడయ్యాడు
(అంత్యక్రియలు కుడా ముగియక ముందే చరిత్రకారుల చేతిలో
హీన చరిత్ర లిఖించుకున్న గడాఫీ కి అంతిమ నివాళి)
--శ్రీ