Saturday, August 25, 2012

ఒక శూన్య సాయంత్రం


ఒకప్పుడు..అదే ఆనాడు
మనిద్దరం కలిసి ఆ దారెంట నడిచిన ఆరోజు
అక్కడే
తుంటరి గాలి నీ కురుల ఒంపుల్లో చిక్కుకుని
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయి
నీ ముంగురులతో ఉయ్యాలలూగి
ముని వేళ్లతో సయ్యాటలాడి
నీ చెక్కిళ్లపై నుండి తుళ్లి పడుతూ కేరింతలు కొడుతూ
నీ సౌకుమార్యాన్ని పూల రెమ్మలపై అద్దడానికన్నా ముందు
కుంచెగా మారి
నా మనసు కాన్వాసుపై
నీ రూపాన్ని చిత్రించింది చూడు ...అక్కడే
నేను మౌన ప్రవాహమై
మాటలకి గంతలు కట్టిన చోట
నీ కళ్ల వాకిళ్లలో నిలబడి లోనికి
తొంగి చూసే ప్రయత్నం చేసిన చోట
నా హృదయ భాషని వినమని చెప్పలేక
నువ్వెళ్లిపోయే క్షణం రాకుండా ఆపేందుకు
కాలానికి సంకెళ్లేయాలని నే విఫలయత్నం చేసిన చోట
గతించిన కాలపు ఆనవాళ్లేమైనా
దొరుకుతాయేమోనని వెతుకుతున్నా

లేవు ఏమీ లేవు ఇక్కడ

గాలి వీస్తోంది కానీ నీ పరిమళం లేదు
ఆ చల్లని తడి స్పర్శ లేదు...ఇప్పుడది
హృదయాలు దగ్దమవుతున్న కవురు కంపు కొడుతోంది.
ఉండుండి విసురుగా నా మొహంపై దాడి చేస్తోంది
నువ్వు లేని నన్నూ..
నా ఒంటరితనాన్నీ అసహ్యించుకొంటుంది
ఆ పూలు కూడా అలానే ఉన్నాయి
కాలాలని నిషేదించిన శిలలమల్లే

ఇప్పుడా దారెంట
జ్ఞాపకాల సమాధులు బద్దలవుతున్నాయ్.
సజీవంగా కప్పెట్టబడ్డ కాలం
నా పాదాల కింద నలుగుతూ
స్మశాన సంగీతాన్ని వినిపిస్తోంది.
జ్ఞాపకం మరోసారి సమాధవుతుంది.
కొత్త ఉదయాల కోసం
ఈ శూన్య సాయంత్రంలో
గతం కుబుసాన్ని విడుచుకొందమని వచ్చిన నేను
స్మృతుల చితి మంటల్లో చలికాగి
అదే గతాన్ని ఇస్త్రీ చేసి తొడుక్కుని
మరో సాయంత్రం కోసం వెనుదిరిగా
-- శ్రీ

Friday, August 17, 2012

మనం జీవించే ఉంటాం..



మనమెప్పుడూ సంఘర్షిస్తుంటాం...
కనపడని బానిస సంకెళ్లని
బద్దలు కొట్టడానికి,
తిరుగుబాటు కొలిమిలని రాజేసేందుకు
ఆలోచనలకి అగ్గి రాస్తుంటాం.

మనమెప్పుడూ నినదిస్తుంటాం.
మట్టి వాసన పీల్చే హక్కు కోసం.
శ్రమకి తగ్గ ఫలితం కోసం.
అసమానతలు లేని సమాజం కోసం.

అందుకే
మనం దోషులమవుతాం

దోపిడీని ప్రశ్నించినందుకూ..
ప్రజాస్వామ్యం ముసుగన్నందుకూ...
ప్రత్యామ్నాయం ఉందన్నందుకే,
మనం అంతర్గత భద్రతకి
పెనుముప్పుగా పరిణమించి
నిషేదానికి గురౌతుంటాం.
పదే పదే నేరగాళ్లమవుతుంటాం.
హత్యా నేరం మోపబడి
శిరస్సుపై రాజ్యం నజరానాలని మోసుకుంటూ,
నీడని కూడా నమ్మలేని నిస్సహాయతలోకి
మన ప్రమేయం లేకుండానే నెట్టివేయబడుతుంటాం.

కాబట్టే

మనం మరణిస్తుంటాం
స్వార్థం ఆకలితో సంభోగించి
నమ్మక ద్రోహాన్ని ప్రసవించినపుడూ,
ఆశ ఆశయాన్ని మానభంగం చేస్తే
కోవర్టులు పుట్టినపుడు
అబద్దపు ఎన్్కౌంటర్లలో మనం
అకస్మాత్తుగా నేల రాలుతుంటాం

కానీ అంతలోనే

మనం మళ్లీ పుట్టుకొస్తాం
నేల రాలిన విత్తనం
మొలకెత్తినంత స్వచ్చంగా
రాత్రిని హత్య చేసిన
అరుణమంత సహజంగా
మళ్లీ మళ్లీ పుట్టుకొస్తాం.
దేర్ ఫోర్
మనమెప్పుడూ జీవించే ఉంటాం
విప్లవం వర్దిల్లాలన్న నినాదంలో,
గోడపైనే కాదు.., గుండెల్లో సైతం
వెలుగుతున్న కాగడాలో,
మార్పుకై ఎదురు చూసే కళ్లల్లో
ఎగిరే ఎర్ర జెండాలమై
మనమెప్పుడూ బతికే ఉంటాం..
 --శ్రీ

Thursday, August 16, 2012

||గీతలు||


నాజీవితంల
నాకు ఎరుకైనవి రెండే గీతలు.
పనిముట్టు చేసిన రాపిడికి
అరిగిపోయిన నా చేతి గీతలు,
చేతిల అరిగి పోయిన గీతల్ని
చెమటతో నా నుదుటిపై 
గీసుకున్న శ్రమ గీతలు

గిప్పుడు గీడెవడో
మాంటెక్ సింగో.. మాయల ఫకీరో
ఎవడైతేనేం లే
ఇద్దరూ చేసేది కనికట్టేగా.
వీడు మాయాజాలంలో
బ్రహ్మ దేవుణ్ణే మించినోడు
నా నుదుటి మీద
బ్రహ్మ గీసిన దరిద్రపు
గీతల్ని చెరపనీకొచ్చిండట.

ిఅంటే ఇప్పుడు రోజూ రాత్రి
మా పొయ్యిల పిల్లి పండుకోదా?
మా పోరలు కూడా
బడికి పోతరా?
మా ఇంట్ల ఇగ నుంచి
వాన నీళ్లు గుంతల్జెయ్యవా? 
రోగమొస్తె మాగ్గూడ
సూది మందులిత్తరా?
గీ మాత్రం గాకుండ
మా దరిద్రమెట్ల పోతది?

దరిద్రమంత బోగొడతనంటే
అబ్బో మా దొడ్డ మనిషినుకున్న.
వీనింట్ల పీనుగెల్ల
పెతోనికి పేదోడంటే
అలుసైపోయింది.
పేదోడి ఆశతోని, ఆకలితోని
ఆడుకునుడు అలవాటైపోతంది.
ఇంతకి వీని ఘనకార్యం జెప్పలే కదా
ఆడికే వత్తన్న...

నాగ్గూడ దెల్వదు గానీ
ఇన్నాళ్లూ గా దరిద్ర గీత 
నా నెత్తి మీదుండెనట.
అది మీదున్నదో, నేను కిందున్ననో
నాకైతే దెల్వదు.
గిప్పుడా గీతని 
గీ మొగోడొచ్చి నా కాళ్ల కింద గీసిండట.
గీత కిందికొస్తే దరిద్రమెట్ల బోతదో
నాకైతే సమజైత లేదు.
నా కాళ్లకి సెప్పులైన లేకపాయె..
కొడుకు దవడ పగలగొడుదును.

వీని కథలు ఇంకా ఐపోలే
అంబానీ గాని ఆస్తుల్ని
అందర్తోని భాగించి అభివృద్దంటండు.
ఉచ్చ తొట్లకి ముప్పై లక్షలు బెట్టినోడే,
రోజుకి 26 రూపాయలు
సంపాయిస్తే పేదోడు గాదంటండు.
వీడు గీసిన గీత 
దరిద్రం పోగొట్టేది కాదు
దరిద్రులని మట్టుబెట్టేది.
వాని గీతలు 
చుక్క నెత్తురు కారకుండా
పేదోళ్ల కుత్తుకలు కోసే కత్తులు.

గిదంత ఎందుగ్గానీ..,
ఒక్కటైతే జరూరుగ ఖరారైంది.
పేదోనికి ఆశపడే అర్హత లేదని.
అరిగిపోయిన అరచేతులతో
నుదుటి మీది ముడతల్ని
తడుముకుని మురుసుకునుడు తప్ప
పేదోనికి మిగిలేదేముండదని
--శ్రీ