Sunday, September 8, 2013

శ్రీ || ప్రేమ లేఖ ||

నేస్తమా
నిజంగా ఇప్పుడు నిజాలే మాట్లాడాలంటే,
జరిగినవో, అలా అని భ్రమించినవో
ఏవైతేనం
ఆ సమయాలని, సందర్బాలని
క్షణం కూడా వదలకుండా పోస్టుమార్టం చేస్తే..
ఎన్ని వేలవుతాయో మరి...,

(లెక్కలకి దూరమై చాన్నాళ్లయింది
పన్నెండేళ్ల కాలమంటే...ఖచ్చితంగా కొన్ని లక్షలుండవూ...)

నిజంగా ఇప్పుడు నిజమే చెబుతున్నా...
నిజమేనేమో...నీ అందానికే ఆకర్షితుణ్ణయ్యానేమో...
నీ పెదాలపైనే కాదు, కళ్లలో సైతం
విరిసే చిరునవ్వుల పూల తోటల్లోనే
దారి తప్పానేమో...
ఆ వెన్నెల రాత్రి
నిజం లాంటి కలేదో వెంబడిస్తే
కాళ్లకి కళ్లు మొలిపించుకుని
దిక్కులనీ, దూరాలనీ దిక్కరించి
నీ ఉనికి కోసం వెతికానేమో.
ఇదంతా నిజంగా వ్యామోహమే కావచ్చు.
అపరిపక్వ ఆలోచనల ఆకర్షణ,
కొన్ని హార్మోన్ల ప్రభావం, మరికొన్ని కాలానుగత
జీవక్రియల ఫలితమే కావచ్చు.

కానీ నేస్తం
ఒక ఆశ సమూలంగా నేల కొరిగాక కూడా
ఒక స్వప్నం శిథిలమయ్యాక కూడా
ఒక నిజం నిర్దయగా నా హృదయాన్ని
హత్య చేసిన తరువాత కూడా
నిజమే చెబుతున్నా నేస్తం
నిన్ను మించిన అందాన్ని ఇప్పటికీ నేనురుగను.

బహుషా...
ఇదీ ఒక మానసిక రోగం కావచ్చు.
వంశీని అడగాలి...
వైద్య పరిభాషలో దీని పేరేంటో...
వెలుగులనీ, వెన్నెలనీ
సవ్వడినీ, చిరునవ్వులనీ నిషేదించి
జ్ఞాపకాల మందుపాతరలని
వర్తమానంలో నిత్యం పేల్చుకుంటా
జీవితానికి సరిపడా దిగులుని
మనుసులో పోగు చేసుకుంటూ
కలల కళేబరాలతో కాపురం చెయ్యడాన్ని
నీ కోసం బాద పడడాన్ని కూడా
వ్యసనంగా మార్చుకోవడాన్ని
ఏమంటారో అడగాలి.

ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం.
నిన్ను మరువడమన్నది అసంభవం.
దానిని మాయరోగ మంటావో
మరోటంటావో నీ ఇష్టం.
--శ్రీ

2 comments:

  1. chalaa bagumdi....we r blessed to have a poet as friend sri...seriously ..!
    vijaya saradhi

    ReplyDelete
  2. బాగుందబ్బాయ్! అక్షరదోషాలు ఉన్నాయి. సవరించుకో. ఇలాంటివి ఇంకా రాస్తూండు. పెన్ను పదునెక్కుతుంది. :)

    ReplyDelete