Friday, July 9, 2010

'మౌనాల మబ్బు తెరలు '

రెండు జతల కళ్ళ

లిప్తపాటు కలయిక లో

మౌనాల మబ్బు తెరల్ని చీల్చుకుని

మౌనంగానే వెల్లువైన వేవేల

భావాల ఉరవళ్ళ పరవళ్ళు

కానీ గుండె గొంతులో ఆనకట్టై

భావాల్ని మాటలు గా మార్చలేని

మూగవాణ్ణి చేసింది



కొలిస్తే అప్పుడు
మన మద్య దూరం

రెండడుగులే

కాని అప్పటికే

మన మనసుల మద్య

ఒక జీవితకాలపు దూరం

ఒక జన్మ మౌనపు మబ్బు తెరలు


ఆ క్షణం మనిద్దరి కళ్ళలో

ఆ మబ్బు తెరల్ని చీల్చలేక

ఆ అనంత మౌనం లో కూరుకుపోయి

అంతర్దానమైన అనురాగపు మెరుపు

మరు క్షణం నుంచి

నన్ను వద్దనుకున్న జీవితం లో నువ్వు

నిన్ను మరువలేని నటన లో నేను

నటించడం నాకు బాగానే అలవాటైంది

లేకుంటే....

తిరస్కరణకి గురైన నా హృదయం

ఎడబాటు మంటల బడబాగ్ని లో

ఆత్మాహుతి చెసుకుంటున్నా..!!

నా పెదాల పై అతికిన చిరునవ్వు..!?

ఆ నవ్వుల వెనక..,

మండుతున్న నా గుండె

కవురు వాసన ఎవ్వరు గుర్తించలేదు మరి!!

"స్పూర్తి కాగడా"

ఇంతకు ముందెన్ని
పిరికి ప్రాణాలు
ఉరితాడుకుయ్యాలలూగడం చూళ్ళేదు?
ఎన్ని
నిస్సహాయ బతుకులు,
నిర్వేదపు జీవితాలు,
మృత్యు కౌగిలిలో శాశ్వతంగా
ఒదిగిపోవడం చూళ్ళేదు?

అప్పుడెప్పుడూ ఇన్ని
ప్రశ్నార్దకాల కంచెలు లేవు
మనసులో ఇన్ని సందేహపు
వలయాలు లేవు.
సన్నని సూదులతో
గుండె అడుగున పొడుస్తున్న
బాదా లేదు

కానీ ఇప్పుడు
ఉవ్వెత్తున యెగసిన
ఒక ఉద్యమ కెరటం
ఉరేసుకుంది

నక్సల్బరి లో
అడవితల్లి కి పురుడు పోసి
ఉద్యమానికి ఊపిరులద్దిన
ఒక ప్రచండ ఝుంఝూ
చైతన్యమారుతం
ఉరేసుకుంది.

దారితప్పి చీకటిలో
అస్తవ్యస్తమైన ఉద్యమమానికి
అస్తమించే వయసులో
వెలుగునివ్వలేక
ఆ ఘడియ రాకమునుపే
కొత్త వెలుగుల
విప్లవోదయాల కోసం
కడలిలో దూకిన సూర్యుడల్లే
అగుపిస్తున్నవ్ 'కానూదా'

ఇన్నాళ్ళూ నువ్వు నడిపిన ఉద్యమం
ఇవ్వాళ నిన్ను నడపాల్సొచ్చిందని
బాదతోనేగా నీ మరణాన్ని కూడా
స్పూర్తి కాగడాగా వెలిగించి
నిష్క్రమించావ్!

కానూదా
నీ త్యాగం వ్యర్దం కాదులే
నీ ఆదర్శాలనర్దం చేసుకోలేని
'వాళ్ళ' వంకెందుకు చూస్తావ్
వక్రమార్గం పట్టిన
ఉద్యమకారులను కూడా చూడకు
వాళ్ళూ వీళ్ళూ కాక లోకంలో
నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లే
నీ ఆదర్శాల వెలుగుల్లో
ఉద్యమ పాఠాలు నేర్చుకుంటున్న వాళ్ళం
నువ్ వెలిగించిన కాగడా మోయాలనుకుంటున్న వాళ్ళం

ఖాళీ

ఎక్కడికెళ్ళినా

నీడలా వెంబడించే
ఒక ప్రశ్న
ఏం చేస్తున్నావ్?
ఎవ్వరడిగినా
అరిగిపొయిన రికార్డు లా
ఒకటే సమాధానం

'ఖాళీ'

కానీ
ఇప్పుడు ఖాళీ ఒక నేరం

ఖాళీ గా వుండటం ఒక నేరం
ఖాళీ గా ఉన్నానని చెప్పడం మరో నేరం
చేసిన నేరాన్నే మళ్ళీ మళ్ళీ
చెయ్యడం మరో నేరం.
18 యేళ్ళ చదువుని
పనికి రాకుండా చేసి
26 యేళ్ళ వయసు లో
బదిలీ అయిన బాద్యతల్నుంచి
తప్పుకు తిరుగుతూ ఖాళీ గా వుండటం
ఖచ్చితం గా నేరాలే
నచ్చని పని చెయ్యలేను
 నచ్చిన దాన్ని చేసే శక్తి లేదు.

కానీ ఇప్పుడు ఖచ్చితం గా
ఏదో ఒకటి చెయ్యాలి.
నచ్చడం నచ్చకపోవడం తో నిమిత్తం లేదు.
ఎందుకంటే ఖాళీ తో నా సహవాసాన్ని
ఎన్నో కళ్ళు నిలదీస్తున్నాయ్.
ఆ ప్రశ్నాశర పరంపరలో
నిరంతర నరకయాతన
'రాజీ' అవసరమని సముదాయిస్తుంది.
అంతరాత్మ మాత్రం అది
ఓటమిని అంగీకరించడమేనని ఘోషిస్తుంది

"ఏడవండి ఏడవండి"

ఏడవండి ఏడవండి

మక్కా మసీదు శాంతి కపోతాల సాక్షి గా
మళ్ళీ పగిలిన
మత సామరస్యపు బుడగని చూసి,
చార్మినార్ ముందు మొలిసిన
ఇనుపముళ్ళ తీగల్నీ,
లాల్బజార్ లో పగిలిన గాజుల్నీ,
రోడ్ల నిండా నిండిన రాళ్ళపై
ఇంకా ఆరని నెత్తుటి మరకల్ని చూసి,

కర్ఫ్యూ పడగ గొడుగు కింద
స్మశాన నిశ్శబ్దపు దుప్పటి
నిండా కప్పుకుని మత్తుగా నిద్దరోతున్న వీధిలో
ఒంటరిగా ఒణుకుతున్న
నాలుగు చక్రాల బతుకు బండిని
తలుపు కన్నంలోంచి చూసుకుని,
రెండు రోజులైనా
పగటికీ రాత్రికీ
తేడా తెలియని ఇరుకు గదిలో
ఖాళీ కడుపుని చూసి
వెకిలిగా వెక్కిరిస్తున్న
గిన్నెలని చూసి ఏడవండి

మిమ్మల్ని మీకు తెలియజేస్తూ
ఎవడో మీ మనసుల్లో కక్కిన
మతపు విషాన్ని తుడుచుకుంటూ
మీ మద్య మంటలు పెట్టి
చలి కాగుతూ వినోదిస్తున్న
రాజకీయ తోడేళ్ళని పారద్రోలలేని
మీ అశక్తతని చూసి వెక్కి వెక్కి ఏడవండి.

ఏడవండి...
మీ కళ్ళు రుధిర ధారలు వర్షించి
చాందస మురికి కొట్టుకుపోయే దాకా,
పాతబస్తీ లో మతతత్వపు మురికి పోయి
మానవత్వపు పూలు వికసించేదాకా,
మతాన్ని శ్వాసిస్తూ మిమ్మల్ని శాసిస్తున్న
రాజకీయం అంతమయ్యేదాకా ఏడుస్తూనే వుండండి.