Monday, February 27, 2012

తప్పు మీది కాదు లే

 

అవును తప్పు మీది కాదు
అస్థిత్వం ఏకోన్ముఖమైనప్పుడు
ఆత్మ గౌరవానికి అర్హతా ప్రమాణాలు
నిర్దేశించబడినప్పుడు
నేను నకిలీలా కనబడితే
పెద్ద విషయమేం కాదు లే

ఇప్పుడు అందరూ తెలంగాణాకి
కట్టుబడ్డ వాళ్ళే
అందరూ తెలంగాణా కోసం
ఎంతటి త్యాగాలకైనా
వెనుదీయని వీరులే
మరి ఇదేం విచిత్రమో ప్రతి వాడూ
అవతలి వాడిని
తెలంగాణా ద్రోహి అంటాడు
ఎవడికివాడు పార్టీల
కట్టుగొయ్యలకి కాళ్ళని కట్టేసుకుని
సమిష్టి ఉద్యమానికి కదిలి రమ్మని
పిలుపునిస్తాడు..
అటువంటి వాళ్ల వెనుక
నడిచి ఉద్రేక పడడానికి
నేనేం వెన్నెముక లేని వాణ్ణి కాను.

ప్రతివాడూ అమరవీరుల
బలిదానాలని వేనోళ్ళ కీర్తించేవాడే
వాళ్ళే రాజేసిన కాష్టం లో
అమాయక ప్రాణాలు
మిడతల్లా రాలుతోంటే
శవాలపై ప్రమాణాలు చేసి
కాడి మొయ్యడానికి పోటీలు పడ్డవాళ్ళే
యాది రెడ్డి శవంతో
ఎన్ని రాజకీయాలు చేసారో
ప్రత్యక్షం గా చూసినోణ్ణి
విక్టిం హుడ్ ని గ్లోరిఫై చేసి
సెలబ్రేట్ చేయ్యలేను
అలా చేయ్యడమే
అస్థిత్వం, ఆత్మగౌరవమంటే
అదే ఉద్యమానికి మద్దతు పలకడమంటే
క్షమించు మిత్రమా
నేను ఆత్మవంచన చేసుకోలేను

అవన్నీ ఎందుకు
ఇది ప్రజా ఉద్యమమంటావా
కాదనను కానీ ఇప్పుడు
తెలంగాణ అస్థిత్వ ఆత్మగౌరవాలు
హైజాక్ చెయ్యబడ్డాయ్
ప్రజా పోరాటం మాటున
నిజంగా జరుగుతున్నది
రాజకీయ పార్టీల మనుగడ
ఆరాటమే
ఈ మాట అంటే
ఉద్యమానికి శత్రువునైతనో
మిత్రుణ్ణైతనో నువ్వే తేల్చుకో
ఎవరినీ నమ్మించడానికి
నేను అభిప్రాయాలని మార్చుకోలేను

ఇది అంతిమ లక్ష్యం కోసం
జరుగుతున్న పోరాటం అంటావా
నా అంతిమ లక్ష్యానికి
ఇది కేవల తొలి అడుగే నేస్తం
అసలు దోపిడీ
రాష్ట్రం వచ్చాక మొదలవుతది
అప్పుడు మనిద్దరికీ మిగిలేది
ఒకటే దారి...
--శ్రీ

3 comments:

  1. "అసలు దోపిడీ
    రాష్ట్రం వచ్చాక మొదలవుతది"

    అంటే ఇప్పుడు దోపిడీ లేదా? విశాలాంధ్ర సమసమాజానికి తార్కాణమని చెప్పుకోవడం సత్యానికి వేల కోట్ల మైళ్ళు దూరం.

    మీకు తెలంగాణా ఏర్పడడం ఇష్టం లేకపోతె మానె, ఆత్మ వంచన మాత్రం చేసుకోవద్దు.

    ReplyDelete
  2. ''అంటే ఇప్పుడు దోపిడీ లేదా? విశాలాంధ్ర సమసమాజానికి తార్కాణమని చెప్పుకోవడం సత్యానికి వేల కోట్ల మైళ్ళు దూరం.''

    నేను ఎక్కడా విశాలాంద్ర సమసమాజానికి తార్కాణమని చెప్పలేదు మిత్రమా... మరొకసారి గమనించు.. ఇక ఇప్పుడు దోపిడీ లేదా అని అడిగావ్...ఆ మాట అడిగినందుకే నన్ను నకిలీవన్నారు.. నేను చెప్పదల్చుకున్నదొక్కటే మిత్రమా... తెలంగాణా రావడంతోనే దోపిడీ ఆగిపోదు..ఇప్పుడు ఒక దోపిడీ కి వ్యతిరేకం గా పోరాడుతుంటే అప్పుడు ఇంకో రకమైన దోపిడీ కి వ్యతిరేఅకం గా పోరాడాల్సి వస్తుంది... రెండూ కూడా మౌలికం గా ఒకటే.. కానీ ఇప్పుడున్న భావోద్వేగ పరిస్థితుల్లో ఆ మాట చెప్పడం కూడా నేరమైపోతంది.

    ReplyDelete
  3. @srikanth aluru:

    తెలంగాణా ఏర్పడ్డాక దోపిడీ అంతరించి పోతుందని ఎవరయినా అంటే అది పొరపాటే. కానీ మీరు రాష్ట్ర ఒర్పాటుతో "అసలు" దోపిడీ మొదలవుతుందని అనడాన్ని నేను ఒప్పుకోలేను.

    తెలంగాణా ఉద్యమంలో అనేక తరంగాలున్నాయి. చైతన్య వికాసానికి ఉద్యమ స్పూర్తి సాయం చేసిందనడం నిజం కాదా?

    తెలంగాణా వ్యతిరేకులు చూపించే "దొరల రాజ్యం" బూచి నిజమయ్యే అవకాశం చాలా తక్కువని నా నమ్మకం.

    ReplyDelete