Saturday, July 7, 2012

'' మౌనం ''



'' మౌనం ''

ఒక ఆలోచన నాలో
మౌన సాగరాన్ని
నిత్యం మథిస్తుంటుంది
ఒక మాట నాలో
పదే పదే అణుబాంబై
పేలుతుంటుంది.
ఆలోచనల కణ విచ్చిత్తి
నిరంతరం కొనసాగుతుంటుంది.
కానీ
గొంతులో పేరుకున్న
మౌనపు పూడిక దాటి
బయట పడలేక మాట
పురిట్లోనే ప్రాణం విడుస్తుంది.

అప్పుడప్పుడూ ఒక మాట
అంతరాంతరాలలో అగ్గి రాజేసి
అమాంతం పైకి రావాలని
అదే పనిగా
ఆరాట పడుతుంటుంది.
అదృష్టవశాత్తు ఆ మాట
మౌనపు అగాథాలని
చేదించుకుని బయటపడ్డా
అప్పటికే అది
నిస్సారమై, నిర్జీవమై
శవం పలుకులని
తలపిస్తోంది.

అణువణువునా మౌనం
ఆవహించిన నేను
ఎన్నటికీ బద్దలవ్వని
అగ్నిపర్వతాన్ని..
సహజ గుణాన్ని కోల్పోయిన
లావాని...
మౌనమెంత దుర్మార్గమైనదంటే
మండుతున్న లావాని సైతం
ఉండ చుట్టి తనలో దాచేసుకోగలదు.

నువ్ దూరమయ్యాక
నాలో స్పందనలున్న
ప్రతీ నాడీకణంలోనూ
మౌనం దిగ్గొట్టబడింది.
నా రక్త నాళాల నిండా
చల్లని మౌనం ప్రవహిస్తోంది
గుండె కవాటాలు సైతం
మౌనాన్ని ఆవాహన
చేసుకున్నాయి.

ఇప్పుడు నేను
మూర్తీభవించిన మౌనం
ప్రతిరూపాన్ని...
మౌనమెలా ఉంటుందంటే
నువ్వెళ్ళిపోయాక నాలా...

మౌనం ఒక
తరగని  జ్ఞాపకాల
ఊటబావి

మౌనమంటే నిశ్శబ్దమా..
కాదు... కాదు
మౌనం
భయంకర విస్పోటనం
-- శ్రీ

1 comment:

  1. మౌనం ఒక
    తరగని జ్ఞాపకాల
    ఊటబావి
    good one, chakkaga undi.

    ReplyDelete