Sunday, November 24, 2013

ఒక వీరుని స్మృతిలో


అప్పుడే రెండేళ్లయిందా
ఒక వసంత కాల మేఘ గర్జన
నేలకొరిగి రెండేళ్లు దాటి పోయ్యింది
ఒక కిరాతక హత్యని
చడీ చప్పుడూ లేకుండా
చీకటి చరిత్రలో కప్పెట్టి రెండేళ్లు దాటి పోయింది.
మూతికంటిన నీ నెత్తురుని
చీలికల నాలుకతో నాకేసి
ఏమీ తెలియనట్టే,
పచ్చి సాధు జంతువు వలెనే
ఫోజులు కొడుతూ
కొత్త పన్నాగాలు పన్నుతుంది
తోడేలు రాజ్యం.

ఏమీ మారలేదు మీసాలన్నా..!!

నీ నినాదంలో గొంతు కలిపి
నిన్ను నమ్మించి నిలువునా కూల్చిన
దాని నిజ రూపం
నిన్ను చంపిన వాడికి
భుజకీర్తులు తొడిగిన నాడే బయటపడింది.
నాటి నుంచి మళ్లీ పాత కథే
ముప్పై ఏళ్ల నాడు దేశభక్తులన్నవాడు చేసిన ద్రోహమే
నాటి నిర్బందమే నేల నలు చెరగులా
జంగల్ మహల్ లో నెత్తుటి వాన కురుస్తూనే ఉంది
గడ్చిరోలి నెత్తురోడుతూనే ఉంది
మొత్తంగా దండకారణ్యంపై
ఇనుప డేగ రెక్కల చప్పుళ్లు
మృత్యు నినాదాలై మార్మోగుతూనే ఉన్నయ్

నిన్ను పోరుబాటలోకి తెచ్చిన
తెలంగాణా సాకారమైనా
రెండు లక్షల గిరిజనాన్ని
జల సమాధి చేసేందుకు
కోరలు సాచి నిలుచున్నది పెట్టుబడి.
ఢిల్లీలో ఇన్నాళ్లూ
వృద్ది రేటు జపం చేసిన గారడీ గాళ్లు
ఇప్పుడు మాంద్యం లెక్కలకి ముసుగులేసి
మాయ జేస్తున్నరు.
దోపిడీకి కొత్త దారులనెతుకుతున్నరు
ఖనిజాలని అమాంతం మింగేందుకూ..,
రైతుని ఎఫ్డీఐ అంగట్లో అమ్మేందుకు.

అప్పటికీ ఇప్పటికీ మారనిదొక్కటే
మీసాలన్నా...
పేదోని కడుపులో ఆకలి
పెద్దోని పర్సులో ఆకలి

--శ్రీ