Wednesday, December 30, 2009

సామాన్యులమంటే మనం

సామాన్యులమంటే మనం

ప్రజలే ప్రభువులన్న
ఒకే అబద్దాన్ని
పదే పదే నమ్మించే
(అ)ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు కాదు

సామాన్యులమంటే మనం
ఇంటి మీద హెలిపాడ్
పెళ్ళానికి చార్టర్డ్ ఫ్లైట్
ఒక్క మాట తో
స్టాక్ మార్కెట్ హాం ఫట్.
త్రీ పీస్ సూట్లేసుకుని
సంపద పై స్వారీ చేస్తూ
తమ ప్రగతే దేశ ప్రగతని
నమ్మబలికే వ్యాపారవేత్తలు కాదు

సామాన్యులమంటే మనం
ప్రభువుల పాపాల్ని తమ విఙానం తో
రాజ్యాంగ లొసుగుల్లో పాతిపెట్టి
అవినీతి మూటల మేడల్లో
హాయిగా వుండే బ్యూరొక్రాట్లు కాదు

సామాన్యులమంటే మనం
హీరొయిన్ల లిప్ స్టిక్ ధరల్ని
హీరోల చీకటి రహస్యాల్ని
ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల్తో
అబద్దపు వార్తల్ని అందం గా
అందించే వాళ్ళు కాదు

సామాన్యులమంటే మనం
30 సెకన్ల ప్రకటన తో
తమ విలువైన కాలాన్ని
సెకన్ల కి కోట్ల చొప్పున
అమ్ముకునే సెలబ్రిటిలు కాదు

సామాన్యులమంటే మనం
పొడవైన కార్లలో వచ్చి
సుపర్ మార్కెట్ తోపుడుబండి నిండా
సరదా కోసం షాపింగ్ చేసె వాళ్ళు కాదు

సామాన్యులమంటే మనం
ఒకటో తారీఖొస్తుందంటే ఒణికిపోయే వాళ్ళం
ఉల్లిపాయ,టమాటా, నిత్యావసరం ఏదైనా
రేటు పెరిగిందంటే
బడ్జెట్ సవరణల్తో కుస్తీ పట్టేవాళ్ళం.
కందిపప్పు పండక్కే వండుకునే వాళ్ళం
1+1 ఆఫర్ ఉన్న చోటే బట్టలు కొనే వాళ్ళం
కుళాయి దగ్గర కుస్తీ పట్టే వాళ్ళం
రేషన్ షాప్ క్యూ లో సహనాన్ని పరీక్షించుకునే వాళ్ళం
వాన కోసం ఎదురుచూసేవాళ్ళం
మట్టి వాసన పీల్చే వాళ్ళం
అనుక్షణం పోరాడే వాళ్ళం..ఆశాజీవులం

(పొట్టకూటి కోసం కవిత్వాన్ని ఫుట్పాత్ మీద అమ్ముకునే ఒక ఐరిష్ కవి కవిత ని ఫ్రీ గా చదివి అనుసరిస్తూ..,అనుకరిస్తూ..
మన్నించాలి నాకు అతని కవితే కాదు కనీసం పేరు కుడా గుర్తు లేదు ) 

Monday, November 16, 2009

కొన్ని జీవితాలంతే

కొన్ని జీవితాలంతే
దుఃఖ సాగరాన్ని మధించటం
తమ జన్మ హక్కయినట్టు,
ఎప్పుడూ ఏడుస్తుంటారు.
అదేదో పెద్ద ఘనకార్యమూ,
దైవ కార్యమూ అన్నది వారి భావన

కొన్ని జీవితాలంతే
కసాయి వాణ్ణి నమ్మే గొర్రెల్లా,
ఎప్పుడూ ఎదుటివారి చేతిలో
మోసగింపబడుతుంటారు
వీళ్ళే లేకుంటే బహుశా
ఈ సృష్టి ఇంత ఆసక్తిగావుండదేమో..!!

కొన్ని జీవితాలంతే
కళ్ళు తెరిచి స్వప్నిస్తారు
కలల్లో జీవిస్తారు
రెంటినీ సమన్వయపర్చే లోపు,
పుణ్య కాలం కాస్తా పూర్తవుతుంది

కొన్ని జీవితాలంతే
వర్తమాన లో గతం గోతుల్ని
అదే పనిగా తవ్వుతుంటరు
భవిశ్యత్తు ని అదే గోతుల్లో
బొందబెడ్తుంటారు .

కొన్ని జీవితాలంతే
నిత్యం పోరాడుతుంటారు
ఆశయాల ఆరాటాలకి
సిద్దాంతాల సంకెళ్ళు
కట్టి పోరాడుతూ వుంటారు
సంకెళ్ళకి తుప్పట్టినా
వీళ్ళకి కనువిప్పు కలగదు
ఏనాటికీ..!!

ఒక్కసారి మాట్లాడాలని

చివరిసారిగా
ఒక్కసారి మాట్లాడాలని
నీ ఙ్ఞాపకాల అంపశయ్య పై
శాశ్వతనిద్రకుపక్రమిస్తున్న
నా మనసుని నగ్నంగా
నీ ముందు ఆవిష్కరించాలని ,
మన మద్యని మౌనపు తలుపులు
ఒక్కసారి తెరిచి
ఇంకొకేఒక్కసారి
మాటల ప్రవాహాన్నిబంధవిముక్తం చేసి
ఆ ప్రవాహం లోతనివితీరా మునగాలని...
అంతకంతకు అధికమౌతున్న ఆరాటం.
'నువ్వూ' అన్న భావన నాకు ఒక 'ఊహే'
అని నిశ్చయం గా నిర్దారణ
జరిగాక కూడా ఎందుకు?
అంటే ఎన్నో సమాదానం లేని సందేహాల్లో
ఇదీ ఒకటంటాను.
అయితే నేస్తం, ఖచ్చితం గా
ఇది సమాంతర గమనం లో
సాగుతున్న మన జీవితాల్ని
సమన్వయపర్చే ప్రయత్నం
ఎంత మాత్రమూ కాదు.
కొన్ని మాటలకి (నేను అన్నవి)
నేను అన్వయించుకున్న అర్దాన్ని వివరించడానికి,
సంకల్పితమో,అసంకల్పితమో
కొన్ని తప్పులకి(నే చేసినవి)
క్షమాపణ అడగి,
మనసు తేలికపర్చుకోవాలన్న
స్వార్దపూరిత ఆలోచనే తప్పమరోటి కాదు.
మన్నించమని అడగా లేను,
మన్నిస్తావని ఆశా లేదు..
అయినా ఎందుకో,..
నా హృదయ స్పందన లో
మిళితమై పోయిన వెర్రి ఆరాటం.