Monday, November 16, 2009

కొన్ని జీవితాలంతే

కొన్ని జీవితాలంతే
దుఃఖ సాగరాన్ని మధించటం
తమ జన్మ హక్కయినట్టు,
ఎప్పుడూ ఏడుస్తుంటారు.
అదేదో పెద్ద ఘనకార్యమూ,
దైవ కార్యమూ అన్నది వారి భావన

కొన్ని జీవితాలంతే
కసాయి వాణ్ణి నమ్మే గొర్రెల్లా,
ఎప్పుడూ ఎదుటివారి చేతిలో
మోసగింపబడుతుంటారు
వీళ్ళే లేకుంటే బహుశా
ఈ సృష్టి ఇంత ఆసక్తిగావుండదేమో..!!

కొన్ని జీవితాలంతే
కళ్ళు తెరిచి స్వప్నిస్తారు
కలల్లో జీవిస్తారు
రెంటినీ సమన్వయపర్చే లోపు,
పుణ్య కాలం కాస్తా పూర్తవుతుంది

కొన్ని జీవితాలంతే
వర్తమాన లో గతం గోతుల్ని
అదే పనిగా తవ్వుతుంటరు
భవిశ్యత్తు ని అదే గోతుల్లో
బొందబెడ్తుంటారు .

కొన్ని జీవితాలంతే
నిత్యం పోరాడుతుంటారు
ఆశయాల ఆరాటాలకి
సిద్దాంతాల సంకెళ్ళు
కట్టి పోరాడుతూ వుంటారు
సంకెళ్ళకి తుప్పట్టినా
వీళ్ళకి కనువిప్పు కలగదు
ఏనాటికీ..!!

No comments:

Post a Comment