Thursday, November 18, 2010

'మళ్ళీ బద్దలైన వార్త '

అలవాటైన నియకృత్యమన్నట్టు
ఇవాళ కూడా వార్తా చానళ్ళలో
అదే వార్త మరోసారి బద్దలైంది.

పురిటి నొప్పుల పచ్చి ఇంకా
పూర్తిగా మానక ముందే
ఒక తల్లి కి పుత్రశోకం...
ఎన్నో ఆశలతో
లక్షలు వెచ్చించిన
ఒక నవవధువు కి
మిగిలిన వైదవ్యం...
పొట్ట కూటి కోసం
నిత్య పోరాటం చేసే
ఒక కూలి వాడికి
కలిగిన కపాల మోక్షం..
ఇలాంటి ఎన్నో నెత్తుటిగాథలు
బద్దలైన ఆ వార్తలోంచి బయటపడ్డాయి...

గతమెంతో ఘనచరిత గల్గిన
నా భారతం ....నేడు
దైవం పేరిట సాగే దాష్టీకానికి
మతం ముసుగు లోని మారణహోమానికి
సజీవ సాక్ష్యం..నిర్జీవ సత్యం

నాడు తెల్లవాడిని తరిమికొట్టిన
మహాత్ముడి శాంతి మంత్రం
ఉగ్రవాదపు విచ్చుకత్తుల
వికృత దాడిలో నేడు
కాళ్ళు విరిగిన కపోతం...
చితి మంటల నిత్యాగ్నిహోత్రం పై
అసహాయం గా రెపరెపలాడుతూ
పొగచూరి మసిబారుతున్న త్రివర్ణం...

'శరదృతువు'

కరిమబ్బుల కడిగేసి
నింగికి నీలవర్ణమేసి

విరితావుల విరగ బూసి
నేలకి హరితాల చీర నేసి

వరి చేలకి పురుడు పోసి
లేత కంకుల్లో పాలుపోసి

రెండు కాలాల మద్య
అందమైన వంతెనలా
శరదృతువు...

ఉరవళ్ళ పరవళ్ళు మాని
స్థితప్రగ్నలా సాగిపోయె పంటకాలువ

పైరు పరువాలని ముద్దాడుతూ,
మకరంద సుగంధాలు తనలో నింపుకుని
బరువెక్కి మెల్లగా వీచే చల్లగాలి

బీరపువ్వు లో మంచు బిందువులు
మందార పువ్వు పుప్పొడి రేణువులు

కొమ్మలిరిగేలా కాసిన జామచెట్టు
పందిరికి పైకప్పులా పాకిన చిక్కుడు తీగ

రాతిరేళ సురీడల్లే వెలిగిపొయే చందమామ
చీకటి లో మదనుడి బాణమేదో
తాకెననిపించే లిల్లీ పూల పరిమళం

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
అంటూ ఆడపడుచుల సంబరాలు

నాగళ్ళకి ,కొడవళ్ళకి
దశమి నాటి ఆయుధ పూజ

భులోక స్వర్గమంటే ఇదేనెమో
స్వర్గమంటే ఇంతకన్న గొప్పగా అయితే వుండదు

'పుట్టినరోజు'

అవ్యక్తపు ఆలోచనల అంతర్ముఖాన్ని
అనుక్షణం వేదించే ఙాపకాల రాచపుళ్ళని
నా ఈ పాతికేళ్ళ అనిశ్చిత జీవితాన్ని
నేడు గతం గోతులలో పాతరేసి
విధాత గీసిన వింత గీతలు చెరిపేసి
నా తలరాతని నేనే రాసుకుని
క్షణానికోసారి చచ్చే కాలం సమాధి పై
నాకు నేనే పురుడు పోసుకుంటున్న
నేడు మళ్ళీ పుడుతున్నా

May Day

రోజూ లాగె ఇవాల కూడా
తూరుపింట నిద్ర లేచాడు భానుడు
తన ముఖం పై పడిన
అరుణ కిరణాల జూసి
అచ్చెరువొంది కిందకి చూస్తే
ధరిత్రి మొత్తం ఎర్రరంగు పులుముకుంది
ఆశ్చర్యం తో మనోనేత్రం తెరిస్తే
అప్పుడు తెలిసింది
ఈనాడు
ధరాతలాన్ని తలపైకెత్తుకుని
నవ సమాజ నిర్మాణం కోసం
ఉత్పత్తి అనే యగ్నం లో
నెత్తుటి తర్పనం కావిస్తూ
నరాలని తాళ్ళు గా పేని
చెమటని ఇరుసులో కందెన గా పూసి
అభివ్రుద్ది రథాన్ని లాగుతున్న
కార్మిక సోదరుల పండగ రోజని

జగానికి ఆది కార్మికుడైన
ఆ సుర్యుడు సైతం ఈనాడు
తన రథం పై ఎర్రజెండా ఎగరేసాడు
ఆ నిరంతర యగ్నం లో సమిధలై
ప్రాణాలని త్రుణ ప్రాయం గా అర్పించి
తన లాగె ఉద్యమ స్పూర్తి వెలుగులని
విశ్వమంతా విరజిమ్ముతున్న అమరజీవులకు
శిరస్సు వంచి నివాళులర్పించాడు

శ్రమైక జీవన సౌందర్యోపాసకులారా
మానవజాతి వికాస విధాతలారా
మీకు వేవేల 'లాల్‌సలాం'లంటూ
కర్తవ్యం మరువని కార్మికుడై
పడమటికి దౌడు తీసాడు.

'మరచిపోవడం మరచిన మనసు'

నువ్వు తలపుకొచ్చిన ప్రతిసారీ
నిశ్చలం గా ఉన్న బావిలో
బండ రాయి పడ్డట్టు ఒక అలజడి
ఆ అలజడి కి
మస్తిష్కం లో భయంకరం గా
రొదచేసే ఆలోచనల కీచురాళ్ళు
గుండె లోతుల్లో విరుచుకుపడుతున్న
ఒక ప్రవాహపు హోరు

ఆ ప్రవాహాన్ని శాంతింపజేసి
ఆ కీచురాళ్ళనన్నీ పారదోలి
మనసుని దారి మళ్ళించే లోపు
నాకోసం మరో బండరాయి సిద్దం
నువ్ నడిచిన దారిగానో
నువ్ పలికిన మాట గానో

నేనెంత పిచ్చోణ్ణో చూసావా
నిన్నే కాదు నీ స్పర్శ
పొందిన అణువణువుని ప్రేమిస్తూ
మనసు లో నీ రూపాన్ని దీపం పెట్టి
శలబం లా దాని చుట్టూ
వర్తులాకార పరిబ్రమణం చేస్తూ
మరచిపోవాలనే ప్రయత్నం చేస్తున్నా

'ఖాళీ2'

ఖాళీ నన్ను రకరకాలు గా వేదిస్తుంది
వ్యవసాయాన్ని యంత్రాలు
పూర్తిగా ఆక్రమించుకున్నాక
మా సావిట్లో గిత్తలు లేని
రెండు ఖాళీ కట్టుగొయ్యల
ఎడతెగని ఎదురుచూపై,
పాలన్నీ పిండేసుకున్నాక
నాలుగు తోలుతిత్తుల్ని
అలసిపోయే దాకా కుడిచి
ఖాళీ కడుపుని నీళ్ళతో నింపుకునే దూడై,
అర్దం లేని ఆశలతో,ఆవేశాలతో
మనసుల మద్య ఖాళీలేర్పరచుకుని
మనుషుల మద్య పెరిగిన దూరమై
ఇంకా ఎన్నో చేదు ఙాపకాలు
కళ్ళు ముసుకుంటే
మస్తిష్కం లో ఒక ఖాళీ పరమాణువు
కణ విచ్చిత్తి చెంది
అనంతం గా ఎదుగుతూ
నన్ను నాలోంచి ఖాళీ చేస్తూ వేదిస్తుంది.

ఖాళీని ఒకప్పుడు ఎంత వెంబడించినా
దొరకలేదు
ఎంసెట్ పుస్తకాల్లో ఊపిరిసలపడానికీ,
ఇంజినీరింగ్ సెమిస్టర్లలో కునుకు తియ్యడానికీ,
డబ్లిన్ పార్ట్ టైం ఉద్యోగాల్లో తిండి తినడానికీ.!!

ఇప్పుడు అదే ఖాళీ నన్నావహించి
ఎంత తరిమినా పోవట్లేదు
తాను వీడిన నా మనసులో నుంచీ,
నిరుద్యోగం నిండిన నా పర్సులో నుంచీ.!!

Friday, November 5, 2010

నిన్నటి కలలో ఇవ్వాల్టి నేను

మాట మాట కి సందేహం
పెదాల్ని సందిగ్దపు దబ్బనంతో
కుట్టేస్తున్న మొహమాటం
చెప్పాలనుకున్నవెన్నో సంగతులు
చెప్పకుండానే సమాదైపొయాయనా
ఒక్కటై వుండాలనుకున్న నా కోరిక ముక్కలై
ఒంటరిగా మిగిలిపొయినందుకా..ఏమో

నీ సాన్నిహిత్యం లో ఇప్పుడు కుడా
గుండె వెయ్యి రెట్లు వేగం గా కొట్టుకుంటుంది
మనసు గాలిలో తేలియాడుతుంది
కాలం కాళ్ళకి బందాలు వేసి
నా మంచం కోడుకి కట్టేయ్యాలనుంది
నీ ముఖ చిత్రాన్ని చూస్తూ
కాలం పై గెలవాలనుంది
కాని గొంతులోనుంచి మాటలే రావట్లేదు
ఎందుకో...

నువ్వు నేను కలిసి
మనమెన్నటికి కాలేమని తెలుసు
నీకు నాకు మద్య
తరగని దూరముందనీ తెలుసు
అందుకే కాబోసు
ఈ మౌనాల అడ్డుగోడలు
బాంబులెట్టి పేల్చినా పగలని గోడలు
అన్నీ తెలిసినా ఈ తాపత్రయం..
నిశీది పై నెగ్గాలనే సినీవాలి లా

ఎడబాటు గాయమే అయినా
ఆ బాధ ఎంత తియ్యన
కాని ఇప్పుడు శాశ్వత విరహాన్ని
సమూలం గా చేధించాలి
ఆశ అనే ఆయుధం లేదు మరి
ఇన్నాళ్ళు అదే నా దైర్యం
అదే నా సైన్యం
ఇప్పుడు నేను
జీవన రణరంగం లో మిగిలిన
ఒంటరి సైనుకుణ్ణి

నేను బందీ చేద్దామనుకున్న కాలమే
నన్ను గతం గుంజ కి కట్టిపడేసింది
నా చుట్టూ గాజు గోడలు కట్టి
నా కళ్ళ ముందు నుంచే
నిన్ను మాత్రం తనతో తీసుకుపోతుంది.

ఇక పై ఆ గతం తోనే బతకాలి
కళ్ళు మూసుకుని స్వగతం లోనె నిన్ను చూసుకొవాలి
నిన్నటి ఊసుల్నే శ్వాసిస్తూ
ఆ ఙ్ఞాపకాలనే మళ్ళీ మళ్ళీ తింటూ
మూగబోయిన పెదాలపై
ఒక చిరునవ్వునంటించుకుని
జీవితాంతం నటించాలి

మౌనపుటెడారి

నా మదిలో మౌనపుటెడారి లో
అనంతమైన ఇసుక రేణువుల్లా
చుట్టూ అన్నీ మృత ఙ్ఞాపకాల దిబ్బలు.

కొన్ని ఇంకా చావలెదు
కొన ప్రాణం తో కొట్టుకుంటున్నయ్
అయ్యో అని అటు పరుగెట్టబోతే
కొన్ని నా కాళ్ళ కిందే చస్తున్నయ్.

దిక్కులన్ని ఏకమైనట్టు
ఎటు చుసినా అవే
అన్నిటిని తడుముకుంటూ
కన్నీళ్ళ తర్పణమిస్తూ
అసంకల్పిత గమనం తో
ఎటు పోవాలో తెలీక
అలా సాగిపోతుంటే
వున్నట్టుండి సుడులు తిరుగుతూ
రేగుతున్న ఇసుక తుఫాను
నన్ను తమతోనే కప్పెట్టాలని
తమలో కలిపేసుకొవాలని...

పోరాటానికలవాటైన ప్రాణమేమో
చావటానికంగీకరించట్లా
అప్పుడ్ప్పుడు దూరం గా
కనిపించే ఒక చిన్న వెలుగు
సాంతం చావని ఆశ లా..
ఒంట్లో శక్తినంతా పోగు చేసుకుని
మళ్ళీ పరుగు..

పరుగెత్తీ, పరుగెత్తీ
సూర్యుడి తో పాటు
నేనూ సొమ్మసిల్లుతున్నా.
రాతిరి నల్ల దుప్పటి
నిండా కప్పుకున్నాక
ఆ మృత ఙ్ఞాపకాల్లో కొన్ని
దెయ్యాలై లేచి నన్ను
తమ ఒళ్ళో లాలిస్తున్నయ్.
నా చెంపలపై కన్నీటి చారికల
ఆనవాళ్ళు చెరుపేస్తున్నయ్.
-------------------------------------