Thursday, November 18, 2010

'ఖాళీ2'

ఖాళీ నన్ను రకరకాలు గా వేదిస్తుంది
వ్యవసాయాన్ని యంత్రాలు
పూర్తిగా ఆక్రమించుకున్నాక
మా సావిట్లో గిత్తలు లేని
రెండు ఖాళీ కట్టుగొయ్యల
ఎడతెగని ఎదురుచూపై,
పాలన్నీ పిండేసుకున్నాక
నాలుగు తోలుతిత్తుల్ని
అలసిపోయే దాకా కుడిచి
ఖాళీ కడుపుని నీళ్ళతో నింపుకునే దూడై,
అర్దం లేని ఆశలతో,ఆవేశాలతో
మనసుల మద్య ఖాళీలేర్పరచుకుని
మనుషుల మద్య పెరిగిన దూరమై
ఇంకా ఎన్నో చేదు ఙాపకాలు
కళ్ళు ముసుకుంటే
మస్తిష్కం లో ఒక ఖాళీ పరమాణువు
కణ విచ్చిత్తి చెంది
అనంతం గా ఎదుగుతూ
నన్ను నాలోంచి ఖాళీ చేస్తూ వేదిస్తుంది.

ఖాళీని ఒకప్పుడు ఎంత వెంబడించినా
దొరకలేదు
ఎంసెట్ పుస్తకాల్లో ఊపిరిసలపడానికీ,
ఇంజినీరింగ్ సెమిస్టర్లలో కునుకు తియ్యడానికీ,
డబ్లిన్ పార్ట్ టైం ఉద్యోగాల్లో తిండి తినడానికీ.!!

ఇప్పుడు అదే ఖాళీ నన్నావహించి
ఎంత తరిమినా పోవట్లేదు
తాను వీడిన నా మనసులో నుంచీ,
నిరుద్యోగం నిండిన నా పర్సులో నుంచీ.!!

No comments:

Post a Comment