Sunday, April 13, 2014

అదృశ్య సంకెళ్లు

భావ దారిద్ర్యపు బందీఖానాలో

పరాదీనతకి గులాం చేస్తూ

పరాన్నబుక్కత్వాన్ని

నర నరాన ఎక్కించుకున్న

ఆలోచనకి వెన్నెముక నివ్వలేని

నిస్సహాయ వ్యవస్థ



స్వార్థం పరమార్థమై

సమూహ భావన మరచి

సమిష్ఠి చింతన విడిచి

అర్థం కోసం

మానవ సంబంధాల అర్దం మార్చి

క్విడ్ ప్రో కో సంస్కృతిలో

ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ

రాత్రికి రాత్రే ఆంటిలాల్లాంటి

అందలాలెక్కెయ్యాలని కలలుగనే

మద్య తరగతి మేదావి వర్గం



నిజం చూడలేక కాదు

మూలాల ఎరుక లేక కాదు

మట్టి వాసనలోని క(అ)మ్మతనం

తెలియక కాదు... కానీ

గ్లోబలైజేషన్ తెచ్చిన

కాస్మోపాలిటన్ వెలుగుల్లో

తనని తాను కోల్పోయి

కార్పోరేట్ల అదృశ్య సంకెళ్లని

అభివృద్ది కిరీటాలుగా భ్రమిస్తూ

అంతఃచేతనని త్యజించి

భావ దాస్యంలో

వినియోగ వ్యసనంలో

ఆధునిక వెట్టిలో

ఊగుతూ..., జోగుతూ...,

విలువలని తాకట్టు పెట్టిన

ఏకోన్ముఖ సమాజం నుంచి

ఇంత కన్నా ఏం ఆశించగలం

--శ్రీ

Sunday, April 6, 2014

"నన్ను వదిలెయ్యండి"

ఎందుకో ఇప్పుడంతా కొత్తగా అనిపిస్తుంది
లోకమంతా కొత్తగా పరిచయమవుతున్నట్టు
ఇన్నాళ్లూ నేనెరిగిన మనుషులేగా
పరిచయాలు పాతవె గాని
పలకరింపుల్లోనే ఏదో తేడా వుంది
మాటల తూకంలో నన్ను తూస్తున్న అనుభూతి 

దూరం మనుషుల మద్య దూరాన్ని పెంచుతుందన్నది అబద్దం
దూరం మనసుల మద్య బంధానికి స్ట్రెస్ టెస్ట్

ఇప్పుడెందుకో ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు
అర్రే వీడు ఎదురుపడ్డాడు పలకరిచాలేమో అని సందేహించకండి
మీ పలకరింపు నాకవసరం లేదు

ప్లాస్టిక్ నవ్వుల కంపు భరించలెకున్నా
మీరు పలకరించి నా నోటికి ప్లాస్టిక్ అద్దకండి ప్లీజ్

ఇప్పుడు నాకే తెలియకుండా కొత్త విద్యేదో అబ్బినట్టుంది
సైనస్ తో ముక్కు వాసనలు పసిగట్టలేకున్నా
మనుషుల అంతరంగాల్లోని మకిలి వాసనలు మాత్రం బాగా తెలుస్తున్నాయి

నా మానాన నన్ను వదిలెయ్యండి
నా గురించి మీరు ఎదో అనుకుంటారేమో అన్న స్థితిని
నేనెప్పుడో దాటేసాను
మీకు తోచినట్టు అనుకోవచ్చని కూడా ప్రకటిస్తున్నా
ఇక మీ నటనలు చాలించి
మీకు మీరుగా రండి
ముసుగులు తొలగించి

--శ్రీ