Saturday, August 25, 2012

ఒక శూన్య సాయంత్రం


ఒకప్పుడు..అదే ఆనాడు
మనిద్దరం కలిసి ఆ దారెంట నడిచిన ఆరోజు
అక్కడే
తుంటరి గాలి నీ కురుల ఒంపుల్లో చిక్కుకుని
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయి
నీ ముంగురులతో ఉయ్యాలలూగి
ముని వేళ్లతో సయ్యాటలాడి
నీ చెక్కిళ్లపై నుండి తుళ్లి పడుతూ కేరింతలు కొడుతూ
నీ సౌకుమార్యాన్ని పూల రెమ్మలపై అద్దడానికన్నా ముందు
కుంచెగా మారి
నా మనసు కాన్వాసుపై
నీ రూపాన్ని చిత్రించింది చూడు ...అక్కడే
నేను మౌన ప్రవాహమై
మాటలకి గంతలు కట్టిన చోట
నీ కళ్ల వాకిళ్లలో నిలబడి లోనికి
తొంగి చూసే ప్రయత్నం చేసిన చోట
నా హృదయ భాషని వినమని చెప్పలేక
నువ్వెళ్లిపోయే క్షణం రాకుండా ఆపేందుకు
కాలానికి సంకెళ్లేయాలని నే విఫలయత్నం చేసిన చోట
గతించిన కాలపు ఆనవాళ్లేమైనా
దొరుకుతాయేమోనని వెతుకుతున్నా

లేవు ఏమీ లేవు ఇక్కడ

గాలి వీస్తోంది కానీ నీ పరిమళం లేదు
ఆ చల్లని తడి స్పర్శ లేదు...ఇప్పుడది
హృదయాలు దగ్దమవుతున్న కవురు కంపు కొడుతోంది.
ఉండుండి విసురుగా నా మొహంపై దాడి చేస్తోంది
నువ్వు లేని నన్నూ..
నా ఒంటరితనాన్నీ అసహ్యించుకొంటుంది
ఆ పూలు కూడా అలానే ఉన్నాయి
కాలాలని నిషేదించిన శిలలమల్లే

ఇప్పుడా దారెంట
జ్ఞాపకాల సమాధులు బద్దలవుతున్నాయ్.
సజీవంగా కప్పెట్టబడ్డ కాలం
నా పాదాల కింద నలుగుతూ
స్మశాన సంగీతాన్ని వినిపిస్తోంది.
జ్ఞాపకం మరోసారి సమాధవుతుంది.
కొత్త ఉదయాల కోసం
ఈ శూన్య సాయంత్రంలో
గతం కుబుసాన్ని విడుచుకొందమని వచ్చిన నేను
స్మృతుల చితి మంటల్లో చలికాగి
అదే గతాన్ని ఇస్త్రీ చేసి తొడుక్కుని
మరో సాయంత్రం కోసం వెనుదిరిగా
-- శ్రీ

1 comment: