Sunday, April 13, 2014

అదృశ్య సంకెళ్లు

భావ దారిద్ర్యపు బందీఖానాలో

పరాదీనతకి గులాం చేస్తూ

పరాన్నబుక్కత్వాన్ని

నర నరాన ఎక్కించుకున్న

ఆలోచనకి వెన్నెముక నివ్వలేని

నిస్సహాయ వ్యవస్థ



స్వార్థం పరమార్థమై

సమూహ భావన మరచి

సమిష్ఠి చింతన విడిచి

అర్థం కోసం

మానవ సంబంధాల అర్దం మార్చి

క్విడ్ ప్రో కో సంస్కృతిలో

ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ

రాత్రికి రాత్రే ఆంటిలాల్లాంటి

అందలాలెక్కెయ్యాలని కలలుగనే

మద్య తరగతి మేదావి వర్గం



నిజం చూడలేక కాదు

మూలాల ఎరుక లేక కాదు

మట్టి వాసనలోని క(అ)మ్మతనం

తెలియక కాదు... కానీ

గ్లోబలైజేషన్ తెచ్చిన

కాస్మోపాలిటన్ వెలుగుల్లో

తనని తాను కోల్పోయి

కార్పోరేట్ల అదృశ్య సంకెళ్లని

అభివృద్ది కిరీటాలుగా భ్రమిస్తూ

అంతఃచేతనని త్యజించి

భావ దాస్యంలో

వినియోగ వ్యసనంలో

ఆధునిక వెట్టిలో

ఊగుతూ..., జోగుతూ...,

విలువలని తాకట్టు పెట్టిన

ఏకోన్ముఖ సమాజం నుంచి

ఇంత కన్నా ఏం ఆశించగలం

--శ్రీ

No comments:

Post a Comment