Saturday, July 26, 2014

మాట కావాలి


మేదావుల మౌనాన్ని ముక్కలు చేసే
ఒక్క మాటన్నా కావాలిప్పుడు.
హక్కుల కోసం దిక్కులు పిక్కటిల్లేలా
నినదించిన గొంతుల్లోంచి
మౌనపు పూడిక తీసే
గునపం లాంటి మాటుంటే
ఎవరైనా అరువియ్యండి నాకు.
ఒక్క కలం పోటుతో
ఈ మట్టి లోపలి నా మూలాలని
పెకలించి,
తల్లి వేరునే కాదు,
తల్లి వేరు తాత ముత్తాతల
చరిత్ర ఆదారంగా
నా స్థానికతని నిర్దారిస్తున్నందుకు కాదు
నేను బాధ పడుతున్నది...
అది తప్పని నీ గొంతులోంచి
ఒక్క మాట కూడా రానందుకు
ఎక్కువ బాధగా ఉంది.
నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇది
ఇక్కడి వాళ్లంతా మా వాళ్లే అన్న
నీ మాటకి అర్దం చెప్పాల్సిన సమయమొచ్చింది.
రాష్ట్రమొచ్చే వరకు నీ వాళ్లయిన వాళ్లు
ఇప్పుడెందుకు పరాయి వాళ్లయ్యారో
నువ్వు సమాదానం చెప్పి తీరాలి.
ఇప్పటికీ నీ వాళ్లే అంటావా... అంటే
నీ మౌనానికి అర్థం ఏంటో చెప్పు.
రాష్ట్ర విభజన వల్ల
కొల్లాటరల్ డామేజ్
ఉంటుందనుకున్నా కానీ....
ఆ ముసుగులో
నువ్వు కూడా హంతకుడివి అవుతావని
ఊహించలేదు నేస్తం..
--శ్రీ

No comments:

Post a Comment