Sunday, October 26, 2014

నాలోని వాడు


నాతో నేనా
నాలో నేనా
బహుషా రెండూ కాదు
నాలో నేను కాలేని ఒకడు

నేను తను కాలేని
నాలా ఉండలేని వాడు.
నన్ను నా నుంచి దూరం చేస్తున్న వాడు.

వాడు
మృత జ్ఞాపకాల దిబ్బల్లోంచి
కొన్ని మాటలని తవ్వుకొచ్చి
వాటి అర్దమేంటో చెప్పమని
అదే పనిగా వేదిస్తుంటాడు.
నాచే సమాధి చేయబడ్డ
మాటల్లోంచి పుట్టుకొచ్చి
నిత్యం ఆ మాటలని
నా చెవుల్లో వినిపిస్తుంటాడు.

మౌనమంటే వాడికసహ్యం
నిత్యం మాటల ప్రవాహమై
నాలో పరుగులు తీస్తుంటాడు.
నా గొంతులోని ఆనకట్టలని
తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
తాను.. తనతో పాటు నేను
ఓడిపోయిన ప్రతిసారీ
నాతో పాటు కన్నీళ్లు పెట్టుకుని
రోదిస్తుంటాడు.

నా ఏకాంత సీమల్లో వాడు
నగ్నంగా సత్యాలని శోదిస్తుంటాడు.
నిజానికి ప్రతీకలా
వాడెప్పుడూ నగ్నంగానే ఉంటాడు.
మాటకి ముసుగు తొడిగిన ప్రతిసారీ
వాడు ఆవేశంతో ఊగిపోతాడు.
నిజాలు ఒక్కోసారి
ఎంతటి పదునైన గాయాలు చేస్తాయో
తెలీదు వాడికి.
ఆ మాటే చెప్తే
పిరికిపందనని ఎగతాళి చేస్తాడు.
గాయాలకి భయపడే వాడు
పోరాటానికి పనికి రాడంటాడు.
పోరాడకుండా బ్రతికే బ్రతుకు
చావుతో సమానమంటాడు

అదేంటో వాడెప్పుడూ
అంతులేని ఆవేశంతో, ఆశావాదంతో
ఉంటాడు.
ఎక్కడి నుంచి వస్తుందో వాడికా శక్తి
నేను ఎన్ని సార్లు వాడిని చంపేసినా
మళ్లీ కొత్తగా..,
మొలకెత్తే విత్తనమంత స్వచ్చంగా
సున్నితంగా చిగురిస్తాడు.
చూస్తుండగానే మహా వృక్షమంత ఎదిగిపోయి
నా వెన్నుముకకి ఆసరాగా నిలుచుంటాడు
వాడే లేకుంటే
నా ఊహలో కూడా
నన్ను నేను చూసుకోలేను.
--శ్రీ 25/10/2014

Tuesday, October 7, 2014

వాడు


మనువుని మించిన వేథావి
మనిషికీ మనిషికీ మద్య
మనసుకీ మనసుకీ మద్య
నెత్తురుకీ నెత్తురుకీ మద్య
విశాలమైన దూరాలు ఏర్పరిచి
ద్వేషాన్ని సాగు చేస్తుంటాడు.
వాడు
మతాన్నో, ప్రాంతాన్నో, భాషనో,
దేవుణ్ణో లేక దేశ భక్తినో
మత్తు మందుగా చేసి
తన మాటలలో దట్టంగా నింపి
ఒకే సారి కొన్ని లక్షల మెదళ్లని
మాస్టర్బేట్ చేస్తుంటాడు.
చాలా తెలివిగా, ప్రణాళికా బద్దంగా
ఆ మెదళ్లని ఆర్గాజానికి తీసుకెళ్లి
పగని స్కలింపజేస్తాడు.
ఆ విద్వేషపు జ్వలనంలో
తగలబడుతున్న శవాల
కవురు వాసనని కమ్మగా పీల్చుకుని
మరోచోట నెత్తుటి కూడు కోసం
నింపాదిగా బయలు దేరతాడు.

--శ్రీ 5/10/2014

Saturday, October 4, 2014

some random thoughts



అగ్నిపర్వత విస్పోటనాలు వినాలన్న కోరిక ఉన్న వాళ్ళు నాతో పాటు సిద్దంకండి

నా గుండెలపై తల వాల్చగలిగే ధైర్యం లేని వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి.

నా మీది ప్రేమ వ్యక్తమవుతుందన్న భయంతో ముఖం దాచుకునే వారంటే నాకసహ్యం... అది నువ్వయినా సరే నా నిచ్చెలీ...

నేనంటూ లేకుంటే నీ అందానికి విలువేముంది... ?? నువ్వూహించింది నిజమే... !! వాడంటే నాకు ఈర్ష్యనే.. !

నువ్వు కాదన్న మాత్రాన నా ప్రేయసివి కాకుండా పోతావా... నేనూ స్వాతి చినుకునే ... హోరు గాలికి గతి తప్పి బండరాయిపై వర్షమయ్యాను అంతే...

వడిలిపోయి రాలిన ఆకులోనే చూస్తావు నువ్వు నన్ను... మళ్లీ మొలవడానికి అది నా సన్నద్దత అని ఎన్నడు అర్థం చేసుకుంటావ్...

నేనంతే... మోదుగ పూలలో విప్లవాన్ని స్వప్నిస్తాను.. ఆకులన్నీ రాలిపోయినా అరుణమై ఉదయిస్తాను

నేనంతే తోకచుక్కలతో సావాసం చేస్తాను. తోకచుక్కలా నాకు తోచిన దిక్కుకు యెగిరిపోతాను... నేను స్వేచ్ఛా పిపాసిని..


Saturday, July 26, 2014

మాట కావాలి


మేదావుల మౌనాన్ని ముక్కలు చేసే
ఒక్క మాటన్నా కావాలిప్పుడు.
హక్కుల కోసం దిక్కులు పిక్కటిల్లేలా
నినదించిన గొంతుల్లోంచి
మౌనపు పూడిక తీసే
గునపం లాంటి మాటుంటే
ఎవరైనా అరువియ్యండి నాకు.
ఒక్క కలం పోటుతో
ఈ మట్టి లోపలి నా మూలాలని
పెకలించి,
తల్లి వేరునే కాదు,
తల్లి వేరు తాత ముత్తాతల
చరిత్ర ఆదారంగా
నా స్థానికతని నిర్దారిస్తున్నందుకు కాదు
నేను బాధ పడుతున్నది...
అది తప్పని నీ గొంతులోంచి
ఒక్క మాట కూడా రానందుకు
ఎక్కువ బాధగా ఉంది.
నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇది
ఇక్కడి వాళ్లంతా మా వాళ్లే అన్న
నీ మాటకి అర్దం చెప్పాల్సిన సమయమొచ్చింది.
రాష్ట్రమొచ్చే వరకు నీ వాళ్లయిన వాళ్లు
ఇప్పుడెందుకు పరాయి వాళ్లయ్యారో
నువ్వు సమాదానం చెప్పి తీరాలి.
ఇప్పటికీ నీ వాళ్లే అంటావా... అంటే
నీ మౌనానికి అర్థం ఏంటో చెప్పు.
రాష్ట్ర విభజన వల్ల
కొల్లాటరల్ డామేజ్
ఉంటుందనుకున్నా కానీ....
ఆ ముసుగులో
నువ్వు కూడా హంతకుడివి అవుతావని
ఊహించలేదు నేస్తం..
--శ్రీ

Sunday, April 13, 2014

అదృశ్య సంకెళ్లు

భావ దారిద్ర్యపు బందీఖానాలో

పరాదీనతకి గులాం చేస్తూ

పరాన్నబుక్కత్వాన్ని

నర నరాన ఎక్కించుకున్న

ఆలోచనకి వెన్నెముక నివ్వలేని

నిస్సహాయ వ్యవస్థ



స్వార్థం పరమార్థమై

సమూహ భావన మరచి

సమిష్ఠి చింతన విడిచి

అర్థం కోసం

మానవ సంబంధాల అర్దం మార్చి

క్విడ్ ప్రో కో సంస్కృతిలో

ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ

రాత్రికి రాత్రే ఆంటిలాల్లాంటి

అందలాలెక్కెయ్యాలని కలలుగనే

మద్య తరగతి మేదావి వర్గం



నిజం చూడలేక కాదు

మూలాల ఎరుక లేక కాదు

మట్టి వాసనలోని క(అ)మ్మతనం

తెలియక కాదు... కానీ

గ్లోబలైజేషన్ తెచ్చిన

కాస్మోపాలిటన్ వెలుగుల్లో

తనని తాను కోల్పోయి

కార్పోరేట్ల అదృశ్య సంకెళ్లని

అభివృద్ది కిరీటాలుగా భ్రమిస్తూ

అంతఃచేతనని త్యజించి

భావ దాస్యంలో

వినియోగ వ్యసనంలో

ఆధునిక వెట్టిలో

ఊగుతూ..., జోగుతూ...,

విలువలని తాకట్టు పెట్టిన

ఏకోన్ముఖ సమాజం నుంచి

ఇంత కన్నా ఏం ఆశించగలం

--శ్రీ

Sunday, April 6, 2014

"నన్ను వదిలెయ్యండి"

ఎందుకో ఇప్పుడంతా కొత్తగా అనిపిస్తుంది
లోకమంతా కొత్తగా పరిచయమవుతున్నట్టు
ఇన్నాళ్లూ నేనెరిగిన మనుషులేగా
పరిచయాలు పాతవె గాని
పలకరింపుల్లోనే ఏదో తేడా వుంది
మాటల తూకంలో నన్ను తూస్తున్న అనుభూతి 

దూరం మనుషుల మద్య దూరాన్ని పెంచుతుందన్నది అబద్దం
దూరం మనసుల మద్య బంధానికి స్ట్రెస్ టెస్ట్

ఇప్పుడెందుకో ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు
అర్రే వీడు ఎదురుపడ్డాడు పలకరిచాలేమో అని సందేహించకండి
మీ పలకరింపు నాకవసరం లేదు

ప్లాస్టిక్ నవ్వుల కంపు భరించలెకున్నా
మీరు పలకరించి నా నోటికి ప్లాస్టిక్ అద్దకండి ప్లీజ్

ఇప్పుడు నాకే తెలియకుండా కొత్త విద్యేదో అబ్బినట్టుంది
సైనస్ తో ముక్కు వాసనలు పసిగట్టలేకున్నా
మనుషుల అంతరంగాల్లోని మకిలి వాసనలు మాత్రం బాగా తెలుస్తున్నాయి

నా మానాన నన్ను వదిలెయ్యండి
నా గురించి మీరు ఎదో అనుకుంటారేమో అన్న స్థితిని
నేనెప్పుడో దాటేసాను
మీకు తోచినట్టు అనుకోవచ్చని కూడా ప్రకటిస్తున్నా
ఇక మీ నటనలు చాలించి
మీకు మీరుగా రండి
ముసుగులు తొలగించి

--శ్రీ